పంచాయతీ రెండో విడత ఎన్నికలకు సిద్ధం

panchayat elections
panchayat elections

మేడ్చల్‌: గ్రామపంచాయతీ రెండో విడత ఎన్నికల ప్రచారం నిన్న సాయంత్రం ముగిసింది. చివరి రోజూ అభ్యర్థులంతా ప్రచారం హోరెత్తించారు. ఒక్కో గ్రామపంచాయతీలో ఇద్దరు, ముగ్గురు. అభ్యర్థులు బరిలో ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల నిర్వాహణకు జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది.  మేడ్చల్‌మల్కాజ్‌గిరి జిల్లాలో మొత్తం 61 గ్రామపంచాయతీలుండగా, మొదటి విడతలో 33 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. రెండో విడత షెడ్యూల్‌లో మేడ్చల్‌లో 17, ఘట్‌కేసర్‌లో 11 పంచాయతీలున్నాయి. మేడ్చల్‌లో 4, ఘట్‌కేసర్‌లో ఒక పంచాయతీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మిగిలిన 23 పంచాయతీలకు గానూ 93 మంది సర్పంచ్‌ అభ్యర్థులు, 223 వార్డులకు గానూ 719 మంది బరిలో ఉన్నారు.
ఎన్నికల విధులకు..
రెండు మండలాల్లోనూ మొత్తం 286 పోలింగ్‌స్టేషన్లు ఉన్నాయి. 1068మంది అధికారులు, సిబ్బంది విధుల్లో పాల్గొననున్నారు. వారిలో స్టేజ్‌1 రిటర్నింగ్‌ అధికారులు 17, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులు 17మంది ఉంటారు. స్టేజ్‌2లో రిటర్నింగ్‌ అధికారులు 36, ప్రీసైడింగ్‌ అధికారులు 343, పోలింగ్‌ అధికారులు 689మంది ఉన్నారు. మరోవైపు గ్రామాలకు తరలించేందుకు బ్యాలెట్‌ బాక్సులు, పేపర్లను ఎంపీడీఓ కార్యాలయాల్లోని స్ర్టాంగ్‌రూముల్లో భద్రపరిచారు. గురువారం ఉదయం రిటర్నింగ్‌ అధికారులకు సామగ్రిని పంపిణీ చేయనున్నారు.