న‌ల్గోండ‌లో ప్రాజెక్ట్‌ల ప‌రిస్థితి? కోమ‌టిరెడ్డి

K.  Venkat reddy 121
K. Venkat reddy

న‌ల్గోండః పాల‌క‌ టిఆర్ఎస్‌పై, మంత్రి  కేటీఆర్ పైన కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ, కేటీఆర్ ఇంగితజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని, కాళేశ్వరం ప్రాజెక్టుపై ఉన్న శ్రద్ధ నల్గొండలోని ప్రాజెక్టులపై లేదని, బీబీనగర్ నిమ్స్ పై వివక్ష చూపుతున్నారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఓ బూటకమని, కమీషన్ల కోసమే ఈ ప్రాజెక్టు కడుతున్నారని, మిషన్ భగీరథ పేరిట వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో నల్గొండ జిల్లాలోని రెండు పార్లమెంట్, 12 అసెంబ్లీ స్థానాలను గెలిచి సోనియా గాంధీకి కానుకగా ఇస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో తాము అధికారంలోకి రాగానే కేసీఆర్ కుటుంబం అవినీతిని బయటపెడతామని, తనకు ఏ పదవులూ వద్దని, కేసీఆర్ ను గద్దె దించడమే ధ్యేయమని అన్నారు. మరోనేత జానారెడ్డి మాట్లాడుతూ, అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని, అవసరమొచ్చినప్పుడు ప్రజలు తమ సత్తా చూపిస్తారని అన్నారు. నల్గొండ జిల్లాలో ఉద్దండులైన నాయకులు, కార్యకర్తలు ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో గెలిచి కాంగ్రెస్ కు కానుకగా ఇస్తామని అన్నారు. ఏఐసీసీ నేత సలీమ్ అహ్మద్ మాట్లాడుతూ, నల్గొండలో 12 అసెంబ్లీ, 2 ఎంపీ సీట్లు గెలుస్తామని, శక్తి యాప్ ద్వారా కాంగ్రెస్ కార్యకర్తలను సంఘటితం చేస్తామని అన్నారు. ప్రతి కార్యకర్త శక్తి యాప్ లో చేరాలని సూచించారు. అమలుకు వీలుకాని హామీలిచ్చి కేసీఆర్ అధికారంలోకి వచ్చారని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మోసం చేస్తున్నాయని, ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు చేసి, ప్రజాస్వామ్యాన్ని హత్య చేశారని, మోదీ, కేసీఆర్ రహస్యమిత్రులని ఆరోపించారు.