న‌గ‌ల‌తో న‌వ‌వ‌ధువు ప‌రార్‌

Bride
Bride

పాట్నా: ఎట్టకేలకు తన కొడుకు ఓ ఇంటివాడయ్యాడన్న ఆ తల్లి ఆనందం ఒక్కరోజులోనే ఆవిరైపోయింది. అత్తింట అడుగుపెట్టిన కొత్తకోడలు శోభనం రోజే నగలతో సహా ఉడాయించడంతో ఆమె షాక్‌కు గురైంది. బీహార్‌లోని బాబువా పట్టణంలో చోటుచేసుకుందీ సంఘటన. 70 ఏళ్ల వృద్ధురాలు షీలాదేవి తన కుమారుడు పింటూకి (40) ఎన్నో సంబంధాలు చూసినా ఒక్కటి కూడా కుదరలేదు. ఎట్టకేలకు ఇటీవల ఓ బంధువు ద్వారా సంబంధం ఖాయమైంది. వధువు సంగీత కుమారికి తల్లిదండ్రులు లేకపోవడం, ఇప్పటికే తన కుమారుడికి వయసు మించిపోవడంతో… షీలా దేవి హడావిడిగా సోమవారమే పెళ్లి తంతు ముగించేసింది. అదే రోజు రాత్రి శోభనానికి అన్నీ ఏర్పాట్లూ చేయగా.. తాను నెలసరిలో ఉన్నానంటూ సంగీత వేరే గదిలో పడుకుంది. తీరా అందరూ పడుకున్న తర్వాత తెల్లారేలోపు గుట్టుచప్పుడు కాకుండా పారిపోయింది. వెళ్తూ వెళ్తూ రిసెప్షన్‌ కార్యక్రమంలో వచ్చిన రూ.20 వేల నగదు, నగలు, ఇతర విలువైన వస్తువులు తీసుకెళ్లిపోయింది. మరుసటి రోజు ఉదయం ఆమె కనిపించక పోవడంతో సదరు కుటుంబమంతా షాక్ తిన్నారు. శుక్రవారం ఆ తల్లీకొడుకులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తమకు మోసకారి మహిళతో సంబంధం కుదిర్చారంటూ ఓ బంధువుపైనే వారు చీటింగ్ కేసు పెట్టడం కొసమెరుపు.