న్యాయవ్యవస్థపై పెత్తనమా?

                           న్యాయవ్యవస్థపై పెత్తనమా?

SIPREME COURT
SUPREME COURT

దేశంలోని అత్యున్నత న్యాయవ్యవస్థ ఇటీవలి కాలంలో వివాదాలమయం అవుతోంది. ప్రత్యేకించి న్యాయమూర్తుల నియామకంలో మళ్లీ విబేధాలు పొడసూపుతున్నాయి. సీనియర్‌ న్యాయమూర్తి ఉత్తరాఖండ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కెఎంజోసెఫ్‌ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి అంశం ఇటీవల పతాకస్థాయికి చేరి న్యాయమూర్తులమధ్య తీవ్ర చర్చనీయాంశం అయింది. అంతేకాకుండా ప్రస్తుతం సుప్రీం న్యాయమూర్తిగా నియమించినప్పటికీ ఆయన్ను సీనియారిటీపరంగా కేంద్రం తక్కువచేసి చూపించిందని న్యాయమూర్తుల్లోనే అసహనం వ్యక్తం అవుతోంది. దేశ సర్వోన్నత న్యాయస్థానంలో పనిచేసే న్యాయమూర్తులు నియామకంలో కేంద్రంజోక్యం పెరుగుతున్నదని ఇటీవలికాలంలో విమర్శలు వెల్లువెత్తడం ఆపై నలుగురు సీనియర్‌ న్యాయమూర్తులు మీడియాకు రావడం జరిగిన సంగతి తెలిసిందే.

వాస్తవానికి కెఎంజోసెఫ్‌ పేరును సుప్రీం కోర్టు కొల్లిజియం సిఫారసులు చేసింది. అయితే ఆయన పేరును పక్కనపెట్టిన కేంద్రం మిగిలిన వారికి పదోన్నతులు కల్పించింది. కొల్లిజియం తీవ్రంగా పరిగణించడం మళ్లీ రెండోసారి కూడా ఆయనపేరునే సిఫారసుచేయడంతో కేంద్రం ఆయన నియామకాన్ని ధృవీకరిస్తూనే ఆయన సీనియారిటీని తక్కువచేసి చూపించిందన్న వాదనలు వెల్లువెత్తుతున్నాయి. మొదటిపేరును మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇందిరా బెనర్జీ, రెండోపేరును ఒడిశా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వినీత్‌సారన్‌ను చూపించిన కేంద్రం మూడో వ్యక్తిగా కెఎంజోసెఫ్‌ను చూపించిందనన భావన న్యాయమూర్తుల్లోనే వ్యక్తం అవుతోంది. శుక్రవారం జారీచేసిన కేంద్రం అధికారిక ప్రకటనతో న్యాయమూర్తులు తిరిగి అందరూ కలిసి సుప్రీం ప్రధాన న్యాయమూర్తిని కలిసి తమ నిరసనను వ్యక్తంచేసారు. అయితే న్యాయమూర్తుల్లోనే ప్రధాన న్యాయమూర్తి తర్వాత అత్యంత సీనియర్‌ అయిన రంజన్‌ గగో§్‌ు శెలవుపై ఉండటంతో చీఫ్‌జస్టిస్‌తో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొనలేకపోయారని అంచనా.

తాజాగా ప్రధానన్యాయమూర్తితోజరిగిన సమావేశంలో జోసెఫ్‌ సీనియారిటీని తక్కువచేసి చూపించడంపైనే ప్రస్తావించారు. కెఎం జోసెఫ్‌ నియామకం ఆదినుంచి వివాదాస్పదంగానే ఉంది. 2016లో ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలన రద్దుచేసి ప్రభుత్వం ఏర్పాటుకు ఉత్తర్వులు జారీచేసారు. అప్పటినుంచి కేంద్రానికి, సుప్రీం న్యాయవ్యవస్థ మధ్య జోసెఫ్‌ పదోన్నతిపై ఇప్పటికీ వివాదం నడుస్తూనే ఉంది. ఉత్తరాఖండ్‌లో అప్పటి హైకోర్టు ఉత్తర్వుల కారణంగానే సుదీర్ఘచరిత్రకలిగిన పార్టీ మళ్లీ అధికారంలోనికి రాగలిగింది. మొత్తం ముగ్గురు న్యాయమూర్తుల నియామకాలతో సుప్రీంకోర్టులో మొత్తం సంఖ్య 25కి చేరింది. ఇంకా ఆరు ఖాళీలను భర్తీచేయాల్సి ఉంటుంది. వీరితోపాటే ముగ్గురు మహిళా న్యాయమూర్తులను సైతం పదోన్నతి కల్పించారు. 68 ఏళ్ల భారత న్యాయవ్యవస్థ చరిత్రలో మహిళా న్యాయమూర్తులు ముగ్గురుపనిచేడయం ఇదే ప్రథమం అని న్యాయనిపుణులే చెపుతున్నారు.

ఇతర న్యాయమూర్తుల నియామకాలన్నింటికంటే జోసెఫ్‌ నియామకమే ముందునుంచి ప్రతిష్టంభనకు గురవుతూ వస్తోంది. తొలుతఈ ఏడాది జనవరి 10వ తేదీ ఆయన పేరును కొల్లిజియం సుప్రీం న్యాయమూర్తిగా సిఫారసుచేస్తూ కేంద్రానికి పంపించింది. ఇదే జాబితాలో సీనియర్‌ కౌన్సెల్‌ ఇందు మల్హోత్రా కూడా ఉన్నారు. ఆమెపేరును ఖరారుచేసిన కేంద్రం జోసెఫ్‌పేరును పంపించలేదు. సీనియారిటీజాబితాలో ఆయన వెనుకంజలో ఉన్నారని చెప్పిన కేంద్రం ప్రాంతీయంగా రాష్ట్రాలప్రాతినిధ్యం పరంగా ఆయన పేరును పంపించలేదని చెపుతూ వచ్చింది. తిరిగి జులై 16వ తేదీ జోసెఫ్‌ పేరును మరోసారి పంపించింది. సీనియారిటీ జాబితాలో ఆయన పేరు చివరిలో ఉంది. ఇదిలా ఉంటే జస్టిస్‌జోసెఫ్‌ సుప్రీంకోర్టులో నాలుగేళ్లకుపైబడి కొనసాగే అవకాశం ఉందని అంచనా.

న్యాయవ్యవస్థతోపాటు రాజకీయ పార్టీల్లోసైతంజోసెఫ్‌ నియామకంపై ఎన్‌డిఎ ప్రభుత్వం వ్యవహరించిన తీరును తప్పుపడుతూ పలు విశ్లేషణలు వెలువడినా కేంద్రం వెనుకంజవేయకుండా ఈసారి ముగ్గురిపేర్లతో చివరిపేరుగా పంపించింది.వాస్తవానికి నిబంధనల ప్రకారంచూస్తే ఒకసారి కొల్లిజియం సిఫారసుచేసిన పేరును మొదటిసారి తిరస్కరించినా రెండోసారి కూడా కొల్లిజియం అదేపేరును పంపిస్తే విధిగా కేంద్రం ఆమోదించాల్సి ఉంటుంది. ఇతర ఆలోచనలు లేకుండా ఆమోదించాల్సి రావడం వల్లనే ఈసారి జోసెఫ్‌ పేరును ఖరారుచేస్తూనే కేంద్రం సీనియారిటీని తక్కువచేసి చూపించిందన్న విమర్శలను ఎదుర్కొంటున్నది. న్యాయవ్యవస్థకు స్వయంప్రతిపత్తి అవసరమని భావించి నాడే సుప్రీంకోర్టులో ఐదుగురు అత్యంత సీనియర్‌ న్యాయమూర్తులతో కూడిన కొల్లిజియం సిఫారసులను మాత్రమే అమలుచేయాలన్న భావనతో ఇప్పటివరకూ అదే సాంప్రదాయం కొనసాగింది.

అయితే గడచిన రెండేళ్లుగా సుప్రీం న్యాయమూర్తుల నియామకాల్లోసైతం కేంద్రం వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదం అయి రాజకీయ జోక్యంపెరుగుతున్నదన్న భావన వ్యక్తం అవుతోంది. సాక్షాత్తూ సుప్రీం ప్రధాన న్యాయమూర్తిపై పదవీచ్యుతికిసైతం మన రాజకీయ నేతలు వెనుకాడలేదు. సిబిఐ జడ్జి మృతిసైతం పెద్ద ఎత్తున వివాదాస్పదం అయింది. ఈ పరిణామాలు న్యాయవ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం కోల్పోయే పరిస్థితినిప్రేరేపిస్తున్నాయని పాలకులు, న్యాయనిపుణులు మేధావులు గుర్తించాలి. 

– దామెర్ల సాయిబాబా, ఎడిటర్‌, హైదరాబాద్‌