నోముల ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు..సీఎం కెసిఆర్
అసెంబ్లీ సమావేశాల్లో సంతాప తీర్మానం
cm-kcr-speech-on-nomula-narsimhaiah-in-assembly
హైదరాబాద్: రెండో రోజు ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో నోముల నర్సింహయ్య మృతి పట్ల సంతాప తీర్మానాన్ని సీఎం కెసిఆర్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఆత్మీయతను ఎప్పటికీ మరువలేను.. ఆయన ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. ఇలాంటి బాధాకరమైన తీర్మానం ప్రవేశపెడుతానని అనుకోలేదు. నోముల నర్సింహయ్య వ్యక్తిగతంగా తనకు దగ్గరి మిత్రులు. చాలా సంవత్సరాలు ఆయనతో కలిసి పని చేశాం. తెలంగాణ ఉద్యమంలోనూ ఆయన కీలకపాత్ర పోషించారు. నర్సింహయ్య గురువు రాఘవరెడ్డిని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని చూసి నర్సింహయ్య బాధపడేవారు. ఆయనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు. కరోనా వచ్చి కూడా పోయింది. హఠాత్తుగా మరణించడం దురదృష్టకరమన్నారు.
ఉద్యమశీలి, ప్రజా నాయకుడు స్వర్గీయ నోముల నర్సింహయ్య.. బడుగు బలహీన వర్గాల వారికి తన జీవితాన్ని అంకితం చేశాడు. నోముల నిరంతరం ప్రజా సేవలో గడిపారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పాలెం గ్రామంలో పేద యాదవకుటుంబంలో జన్మించిన నోముల.. ఓయూలో ఎంఏ, ఎల్ఎల్బీ పూర్తి చేశారు. విద్యార్థి దశ నుంచే ఉద్యమాలకు నాయకత్వం వహించారు. పేద ప్రజల పక్షం వహించి ప్రజా న్యాయవాదిగా పేరు తెచ్చుకున్నారు. తన ఆశయాలకు అనుగుణంగా సీపీఎం పార్టీలో చేరారు. మండల పరిషత్ అధ్యక్షునిగా ప్రారంభమైన నోముల ప్రస్థానం ఎమ్మెల్యే స్థాయికి ఎదిగారు. ఆయన ప్రసంగాలు ఎందరినో ఆకర్షించేవి.
తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు పట్ల సీపీఎం పార్టీ వైఖరికి నిరసనగా ఆ పార్టీని వదిలి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018లో నాగార్జున సాగర్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. 64 ఏండ్ల వయసులో గత డిసెంబర్లో గుండెపోటుతో మరణించడం తెలంగాణ ప్రజలకు తీరని దుఃఖాన్ని మిగిల్చింది. ఆయన ఆత్మీయతను ఎప్పటికీ మరువలేను అని సీఎం అన్నారు.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/