నొప్పింపక, తానొవ్వక…

feeling
జీవితంలో చాలామంది ఒకవిధమైన సందర్భాలు ఎదుర్కొంటూ ఉంటారు. ఇంట్లో పెద్దవాళ్లు లేదా బయట ఆఫీసులో సహఉద్యోగులు లేదా పై అధికారులు మీకు తెలిసిన విషయాలనే, ఇది వరకు వారు చెప్పిన సంగతులనే మళ్లీ మళ్లీ చెప్పటం, పని విషయంలో మీకు తెలిసిన వాటినే వివరించడం చేస్తుంటారు. అటువంటపుడు నిర్మొహమాటంగా ఆపమనలేరు. అలాగని సమయం వృధా చేసుకుంటూ వినలేరు. తమ సమయం వృధా అయిపోతుందనే బాధ ఒకవైపు ఉంటే, వారిని వారిస్తే అప్పటి వరకు ఉన్న సత్సంబంధాలు పోతాయేమో అనే బాధ మరొక పక్క పీడిస్తుంది. మరి అప్పుడు ఏం చేస్తారంటే:

– ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ ఉండక తప్పని స్థితి మీకుండవచ్చు. కానీ మీకున్న ఒక సౌకర్యం ఏమిటంటే మీ మనసుని అక్కడ ఉంచాల్సిన పనిలేదు.
– మాకు అన్నీ తెలుసు అన్నట్టు ఉపన్యాసాలు ఇచ్చేవారికి మీరు ఇవ్వగల మంచి సమాధానం ఇదే. మనసుని, ఆలోచనల్ని అక్కడ ఉంచకపోవటం. అయితే ఆ విషయం ఎదుటివారికి తెలియకుండా జాగ్రత్తపడాలి కదా, అందుకే అప్పుడప్పుడు ఓ చిరునవ్వు, ఓ తలాడింపు ఉంటే వారి మాటలు వినడం లేదనే సందేహం రాదు. అయితే పొరబాటున కూడా మాట్లాడకండి దొరికిపోయే ప్రమాదం ఉంటుంది మరి.
– ‘అంత ఓపిక లేదు, ఆలోచనలు ఒకచోట మనిషిని ఒకచోట ఉండలేను, మరొక ఉపాయం లేదా’
– అని మీరంటే అలాంటిది కూడా ఒకటి ఉంది. వారు ఆయా మహత్తర సంగతులు ఎత్తగానే
– మీరూ అంతే ఒడుపుగా మాటలు మొదలుపెట్టాలి. ఆ మాటలు ఎలా ఉండాలంటే
– ‘ఆ… గుర్తుంది. అలాంటి విషయాలు నేనెలా మర్చిపోతాను. మీరు చెప్పారు ఒకసారి. మీరు ఒక్కసారి చెప్పారంటే చాలు అలా పొల్లుపోకుండా గుర్తుండిపోతుంది. ఇప్పుడు చెప్పమన్నా ఒక్క అక్షరం కూడా తప్పుపోకుండా చెప్పేస్తాను’…. ఇలా ఆయా సందర్భాలను, మనుషులను బట్టి మీ తెలివితేటలు జోడించి చెప్పేయవచ్చు.