నేడు పరిశ్రమ ప్రముఖులతో ఆర్‌బిఐ గవర్నర్‌ భేటీ!

shaktikanta das
shaktikanta das

ముంబయి: రిజర్వుబ్యాంకు గవర్నర్‌ శక్తికాంతదాస్‌ పారిశ్రామికరంగాల నిపుణులతో గురువారం సమావేశం నిర్వహిస్తున్నారు. 2018-19 సంవత్సరానికి ఆరో ద్వైమాసిక మానిటరీ పాలసీ నివేదిక వెలువరించేముందు అన్నిరంగాలకు చెందిన ప్రముఖులతో సమావేశం కావడం సహజంగానే రిజర్వుబ్యాంకు గవర్నర్లుచేస్తుంటారు. ఆర్‌బిఐ గవర్నర్‌ ఇందులోభాగంగానే ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు బ్యాంకు అధికారులు చెపుతున్నారు. ఈ సందర్భంగా వివిధ పారిశ్రామిక మండళ్ల ప్రతినిధులను కలుసుకుని వారి సమస్యలు, రుణపరపతిపై వారి ఆందోళన, ఆర్ధికపరంగా మరింతగా పటిష్టంగా కొనసాగేందుకు అవసరమైన సలహాలుసూచనలు తీసుకుంటారని సమాచారం. 25వ గవర్నర్‌గా గతనెలలో దాస్‌ బాద్యతలు స్వీకరించిన తర్వాత బ్యాంకులు, ఎన్‌బిఎఫ్‌సి, ఎంఎస్‌ఎంఇ రంగాల నిపుణలతో భేటీ అయ్యారు. అలాగే ఇపుడు 17వ తేదీ అంటే గురువారం పారిశ్రామికరంగానికి చెందిన ప్రముఖ మండళ్ళ నిపుణులతో సమావేశాలు నిర్వహించనున్నట్లు దాస్‌ తన ట్విట్టర్‌లో వెల్లడించారు. పారిశ్రామికరంగాలు ఇప్పటికే రేట్‌కట్‌ అవసరమని కోరుతున్నాయి. రిటైల్‌ద్రవ్యోల్బణం 18 నెలల కనిష్టానికి ఈఅంటే డిసెంబరునెలలో 2.19శాతంగా నిలిచింది. టోకుధరల సూచీ ద్రవ్యోల్బణం కూడా ఎనిమిదినెలల కనిష్టానికి అంటే 3.80శాతంగా డిసెంబరునెలలో నమోదయింది. ప్రత్యేకించి ఇంధనం, ఆహార ఉత్పత్తులధరలు తగ్గడంతో కొంతమేర తగ్గిందనే చెప్పాలి.ఇక వినియోగరంగధరలసూచీ ఆధారితద్రవ్యోల్బణం 2.33శాతంగా నివంబరులో ఉంటే, డిసెంబరు 5.21శాతంగా 2017లో ఉంది. ఆర్‌బిఐ తన మానిటరీ పాలసీ సమీక్షల్లో రిటైల్‌ ద్రవ్యోల్బణాన్ని ప్రామాణికంగా తీసుకుంటుంది. ద్రవ్యోల్బనం నాలుగుశాతంగా ఉండాలన్న లక్ష్యంతో ఆర్‌బిఐ ఆర్ధికపరిశీలనచేస్తోంది. అయితే మరో రెండుశాతం అటూ ఇటూగా ఉండవచ్చన్న భావన వ్యక్తంచేసింది. ఇక నవంబరునెలలో పారిశ్రామిక ఉత్పత్తిసూచీ 17 నెలల కనిష్టానికి అంటే 0.5శాతంగా నమోదయింది. ఉత్పత్తిరంగంలో తగ్గడమే ఇందుకు కారణంగా చెపుతున్నారు. వినియోగరంగ ఉత్పత్తులకంపెనీలు, కేపిటల్‌గూడ్స్‌పరంగా ఉత్పత్తి తగ్గింది. విదేశీ ఆర్డర్లు, బల్క్‌ఆర్డర్లు ఆధారంగానే ఉత్పత్తిరంగం వృద్ధి నమోదవుతుందనిఅంచనా.