నేడు తొలి వన్డే

Team

నేడు తొలి వన్డే
భారత్‌, ఆస్ట్రేలియా మ్యాచ్‌కి సిద్ధమైన వాకా స్టేడియం
పెర్త్‌ : వాకా వేదికగా భారత్‌,ఆస్ట్రేలియా మధ్య నేడు తొలి వన్డే జరుగనుంది.కాగా ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా జరిగిన రెండు ప్రాక్టీస్‌ మ్యాచ్‌ల్లో ఘన విజయం సాధించిన టీమిండియా అసలు పోరుకు సిద్దమవుతుంది.వార్మప్‌ టి20లో కోహ్లీ,ధవన్‌లు తమ సత్తా చాటారు.పశ్చిమ ఆస్ట్రేలియా జట్టును ధోనీ సేన ఖంగుతినిపించగా,ఆ తరువాత జరిగిన వార్మప్‌ వన్డేలో బౌలర్లు బాగా ఆడటంతో టీమిండియా విజయం సాధించింది.కాగా భారత్‌,ఆసీస్‌ మధ్య ఆస్ట్రేలియా వేదికగా ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ద్వైపాక్షిక వన్డే సిరీస్‌ జరుగలేదు. గతంలో వన్డే,ప్రపంచ కప్‌,ముక్కోణపు లేదా నాలుగు దేశాల టోర్నీలలో పాల్గొన్న రెండు జట్లు ఈసారి ముఖాముఖి పోరుకు సన్నద్దమవుతున్నాయి. కాగా ఇటీవల స్వదేశంలో జరిగిన రెండు టెస్ట్‌ సిరీస్‌ల్లో ఆస్ట్రేలియా ఘన విజయాలు సాధించి మంచి జోష్‌ మీద ఉండగా,టీమిండియా కూడా టెస్ట్‌ల్లో పటిష్టమైన దక్షిణాఫ్రికాను మట్టి కరిపించి అంతే ఉత్సాహంతో ఉంది.కాగా కోహ్లీ, ధోనీ, ధావన్‌లు ఐసిసి ర్యాంకింగ్స్‌లో టాప్‌-10లో ఉండగా,ప్రస్తుత ఆస్ట్రేలియా జట్టులో మ్యాక్స్‌వెల్‌ ఒక్కడే ర్యాంకింగ్స్‌లో 10వ స్థానంలో ఉన్నాడు.

బౌలింగ్‌ వ్యూహం వెల్లడి…
తొలి వన్డేలో తాము అనుసరించబోయే బౌలింగ్‌ వ్యూహం ఏమిటో టీమిండియా కెప్టెన్‌ ధోనీ వెల్లడించాడు.ముగ్గురు పేసర్లు,ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగుతామని పేర్కొన్నాడు.ఒకవేళ ఇదే జరిగితే ఉమేష్‌యాదవ్‌,ఇషాంత్‌ శర్మలతో పాటు కొత్త పేసర్‌ బరీందర్‌ స్రాన్‌ కూడా తుది జట్టులో ఆడే అవకాశముంది.ఒకవేళ పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ ఉండాలంటే మాత్రం రిషి ధావన్‌ను జట్టులోకి తీసుకుంటారు.ఇక స్పిన్నర్లలో రవిచంద్రన్‌ అశ్విన్‌ తుది జట్టులో ఉండటం ఖాయం కాగా,రెండవ స్పిన్నర్‌గా జడేజా వైపు ధోనీ మొగ్గు చూపే అవకాశం ఉంది.