నేడు గాంధీభవన్‌కు రేవంత్‌

revanth reddy
revanth reddy

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీలో చేరిన తరువాత గత కొంతకాలంగా వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తూ వచ్చిన కోడంగల్‌ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి మొదటి సారిగా పార్టీ కార్యాలయం గాంధీభవన్‌ మెట్లు ఎక్కబోతున్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ జన్మదినోత్సవాన్ని మూహుర్తంగా చేసుకుని గాంధీభవన్‌ వేదికగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఢిల్లీలోని ఎఐసిసి కార్యలయంలో రాహుల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకున్న రేవంత్‌ నెలరోజులకు పైగా గాంధీభవన్‌కు రాలేదు. తెలుగుదేశం పార్టీని వదలి కాంగ్రెస్‌ పార్టీలో చేరిన రేవంత్‌ ఆయనతో పాటు మాజీ మంత్రి బోడ జనార్థన్‌, మాజీ ఎమ్మెల్యేలు విజయరమణరావు, సీతకమ్మ, వేంనరేందర్‌రెడ్డి, సోయం బాబురావు, గంగాధర్‌గౌడ్‌, కత్తెర గంగాధర్‌, మాజీ ఎమ్మెల్సీలు అరికెల నర్సారెడ్డి, ఎస్సీనేతలు దొమ్మాటి సాంబయ్య, బిసి నేతలు తోటకూర జంగయ్య యాదవ్‌, రాజారాంయాదవ్‌ చారుగొండ వెంకటేష్‌ తదితర నేదలు రేవంత్‌ నేతృత్వంలో గత అక్టోబరు 30న కాంగ్రెస్‌ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. అయితే కాంగ్రెస్‌ పార్టీలో చేరే వరకు సంచనాలు సృష్టిస్తూ ప్రచార సాధానాల్లో పీక్‌ స్థాయికి చేరుకున్న రేవంత్‌ పరిస్థితి హైప్‌తో ఎలాంటి పరిస్థితి వస్తుందనుకున్నారో ఏమో కొంత కాలం మీడియాకు దూరంగా ఉన్నారు. కెటిఆర్‌, సత్యం రామలింగరాజు కొడుకులు కలిసిన ఫోటోతో సోషల్‌ మీడియాలో హల్‌ చేసినా, సన్‌బర్న్‌పై మీడియా చిట్‌చాట్‌ మినహా పెద్దగా ప్రజల ముందుకు రాలేదు. ఇటీవల అచ్చంపేట్‌ ప్రజాగర్జనలో పెద్ద వాహనర్యాలీఓ పాల్గొని పార్టీ ప్రత్యక్ష కార్యక్రమాల్లో తన ఆరంగేట్రం చేశారు. ఆ తరువాత సొంత నియోజకవర్గం కొడంగల్‌కే పరిమితమైయ్యారు. కాంగ్రెస్‌ పార్టీలోకి చేరిన నాటి నుంచి గాంధీభవన్‌కు వెళ్లని రేవంత్‌ మొదటి సారిగా తనతో పాటు టిడిపి నుంచి కాంగ్రెస్‌లో చేరిన నేతలందరితో కలిసి గాంధీభవన్‌లో అడుగు పెట్టాలని నిర్ణయించారు. సోనియాగాంధీ జన్మదినం, తెలంగాణ మొదటి ప్రకటన వచ్చిన రోజున ముహుర్తంగా చేసుకుని తెలంగాణ పాలకపక్షంపై మరో పోరాటానికి సిద్ధమవుతున్నారు.