నేడు అసెంబ్లీ రద్దు

TS CM KCR
TS CM KCR

కేబినెట్‌ భేటీలో అధికారిక తీర్మానం
గవర్నర్‌కు సమర్పించనున్న కెసిఆర్‌
తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం
సెక్రటేరియట్‌లో ఫైళ్లను కదలింప చేసుకున్న ఎమ్మెల్యేలు
చొప్పదండి ఎమ్మెల్యే శోభకు టిక్కెట్‌ ఇవ్వొద్దని నేతల ఫిర్యాదు
హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ రద్దుకు సర్వంసిద్దమైంది. ఈమేరకు బుధవారం ప్రగతి భవన్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె. జోషి, అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, సిఎంఓ అధికారులతో సిఎం కెసిఆర్‌, భేటీ అయ్యారు. వారితో విసృతంగా చర్చించారు.అసెంబ్లీ రద్దయిన తర్వాత ఆపధర్మ ప్రభు త్వంలో ఉండే అధికారాలపై చర్చించారు. పలు కీలకమైన ఫైళ్లపై సంతకం కూడా చేశారు.గురువారం జరిగే కేబినెట్‌ భేటీలో చర్చించే అంశాలకు సంబంధించి అజెండా, అసెంబ్లీ తర్వాత ఏర్పడే పరిణామాలను ప్రధానంగా చర్చించారు. అసెంబ్లీ రద్దయిన తర్వాత సిఎంతో సహా, మంత్రులు తమ పదవుల్లో యధావిధిగా కొనసాగే అవకాశం ఉంటుంది. ఇదే సమయంలో స్పీకర్‌ మధుసూధనచారి తన పదవిలో కొనసాగుతారు. అసెంబ్లీ రద్దు కారణంగా ఎమ్మెల్యే పదవులు మాత్రమే ఉండవు. వారంతా అటోమెటిక్‌గా మాజీ ఎమ్మెల్యేలవుతారు. అయితే,ఎమ్మెల్సీలు తమ పదవీ విరమణ సమయం వచ్చే వరకు అలాగే కొనసాగుతారు. కాగా, అసెంబ్లీకి రద్దుపై తీర్మానం చేసేందుకు గురువారం మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రగతి భవన్‌లో కేబినెట్‌ సమావేశం అయ్యే అవకాశం ఉంది. అసెంబ్లీ రద్దుపై నిర్ణయం తీసుకుంటే కేబినెట్‌ భేటీ తర్వాత కెసిఆర్‌ మధ్యాహ్నం 1-30 గంటలకు గవర్నర్‌ను రాజ్‌భవన్‌లో కలిసి రాజీనామా సమర్పించనున్నారు. ఆ తర్వాత తెలంగాణ భవన్‌లో సిఎం కెసిఆర్‌ మీడియా సమావేశం పెట్టనున్నారు.
కాగా, ఆపధర్మ ప్రభుత్వాన్ని కొనసాగించాలని కెసిఆర్‌ను గవర్నర్‌ కోరే అవకాశం ఉంటుంది. అపధర్మ ప్రభుత్వంగా కొనసాగినప్పుడు సిఎంకు,మంత్రులకు ఉండే అధికారాలపై సిఎం కెసిఆర్‌ ఇప్పటికే ఒక స్పష్టతకు వచ్చారు. అయితే మొదట వీలైనంత త్వరగా అసెంబ్లీని సమావేశ పరిచి అసెంబ్లీ రద్దును ప్రకటిస్తూ సిఎం కెసిఆర్‌ సుదీర్ఘంగా ప్రసంగించాలనే ఆలోచన కూడా చేశారని తెలుస్తోంది. ఈనెల 22న అసెంబ్లీని రద్దు చేయాలనే ముహూర్తాన్ని కూడా నిర్ణయించుకున్నారని ప్రచారం జరిగింది. ఈలోగా ఇంకా ఏమైనా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందని అభిప్రాయాలు వచ్చాయి. బడ్జెట్‌ సమావేశాలు ముగిసి ఆరు నెలలు గడుస్తున్నందున నిబంధనల మేరకు ఈనెల 27 లోగా అసెంబ్లీని తప్పనిసరిగా సమావేశం కావాల్సి ఉంటుంది. ఒకవేళ అసెంబ్లీ రద్దయితే, సమావేశాలతో పనిలేదు. అసెంబ్లీ రద్దు కొంత ఆలస్యమైతే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. 22న అసెంబ్లీ రద్దయ్యే పరిస్థితులు ఉంటే, ఈలోగా ప్రభుత్వం వద్ద పెండింగ్‌ పనులను పూర్తి చేసుకోవచ్చని ఎమ్మెల్యేల అంచనా. అయితే, 6న అసెంబ్లీ రద్దవుతుందన్న ప్రచారం జోరందుకోవడంతో ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు సచివాలయానికి వచ్చి పెండింగ్‌ ఫైళ్లను కదలింప చేసుకున్నారు, అధికారుల చేత సంతకాలు చేయించుకున్నారు. అసెంబ్లీ రద్దు తర్వాత 7న హుస్నాబాద్‌లో జరిగే అశీర్వాద బహిరంగ సభతో ఎన్నికల ప్రచారాన్ని సిఎం కెసిఆర్‌ ప్రారంభించనున్నారు.
ఇదిలా ఉండగా, చొప్పదండి ఎమ్మెల్యే బొడిగె శోభ ప్రజలను, ప్రజాప్రతినిధులను అవమాన పరుస్తున్నారని పార్టీకి నష్టం కలిగించే చర్యలకు పాల్పడుతున్నారని నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుకు ఫిర్యాదు చేశారు. ఆమెపై చర్య తీసుకోవాలని, వచ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్‌ ఇవ్వవద్దని కోరారు. పేద ప్రజలపై ఎస్సీ,ఎస్టీ కేసులు నమోదు చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని,వ్యక్తిగత స్వార్థంతో పార్టీకి నష్టం కలిగించేలా ప్రవర్తిస్తున్నారని,అభివృద్ది కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయడం లేదని,అసలు స్థానిక ప్రజాప్రతినిధులెవరినీ పరిగణలోకి తీసుకోవడం లేదని,ఎస్‌జిఎస్‌ పేరుతో సాంత సైన్యం స్థాపించుకుని ప్రజలను,ప్రజాప్రతి నిధులను బెదిరిస్తున్నారని వారు సిఎంకు ఫిర్యాదు చేశారు. మార్కెట్‌ కమిటీ పాలక వర్గం ప్రమాణ స్వీకారానికి పిలిచినా, గైర్హాజరయ్యారని చెప్పారు. అధికారిక కార్యక్రమంలో మార్కెట్‌ చైర్మన్‌,ఆమె భర్త పాల్గొంటే మంత్రి,ఎంపీ ముందే అవమానించిన సంఘటనను వివరించారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరారు. సిఎంను కలిసిన వారిలో చొప్పదండి, రామడుగు, గంగాధర,కొడిమ్యాల,బోయినపల్లి జడ్పిటీసీలు ఇప్పనిపల్లి సాంబయ్య, వీర్ల కవిత, ఆకుల శ్రీలత, ప్రశాంతి, లచ్చిరెడ్డి, గంగాధర, బోయినపల్లి,రామగుడు,కొడిమ్యాల,ఎంపీపీలు బాలాగౌడ్‌, మాధవ్‌, కిష్టారెడ్డి, స్వర్ణలత, చొప్పదండి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పర్సన్‌ గడ్డం సుమలత,మల్యాల మార్కెట్‌ చైర్‌పర్సన్‌ లక్ష్మి,జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్‌ ఏనుగు రవీందర్‌రెడ్డి, డిఎస్‌ఎంఎస్‌ చైర్మన్‌ సురేందర్‌రెడ్డి,ఇతర ముఖ్యనాయకులున్నారు.