నేటి అలంకారం శ్రీమహిషాసురమర్దినీదేవి

(విజయవాడ కనకదుర్గ అమ్మవారు)

నేటి అలంకారం  శ్రీమహిషాసురమర్దినీదేవి
Sri Mahishasuramardhini alamkaram

”మహిషమస్తక నృత్త వినోదిని
స్పుటరణన్మణి నూపుర మేఖలా
జననరక్షణ మోక్ష విధాయిని
జయతి శుంభ నిశుంభ నిషూదిని
దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో నవమి తిథిన అమ్మవారు మహిషాసురమర్దినిగా దర్శనమిస్తుంది. దేవీ నవావతారాలలో అత్యుగ్రరూపం మహిషాసురమర్దినీదేవి. ఆశ్వయుజ శుద్ధ నవమి రోజున అమ్మ మహిషాసురమర్దినిగా అవతరించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసింది. ధర్మ విజయానికి సంకేతంగా ఆశ్వయుజ శుద్ధనవమినే ‘మహర్నవమి గా భక్తులు ఉత్సవం జరుపుకొంటారు. సింహ వాహనారూఢియై పాశం, పరుశు, త్రిశూలం, చక్రం, ఖడ్గం, విల్లు, ఆదిగా గల ఆయుధాలను ధరించిన అమ్మ సకల దేవతల అంశాలతో మహాశక్తి రూపంతో ఈ రోజున దుర్గమ్మవారు దర్శనమిస్తుంది. మహిషాసురుడనే రాక్షసుడిని సంహరించిన అమ్మను మహిషాసురమర్దినీదేవీగా పూజిస్తే శత్రుభయం తొలగిపోయి సకల విజయాలు కలుగుతాయి. విజయవాడలో ఇంద్రకీలాద్రిపై అమ్మవారు ఆ ఉగ్రరూపంతోనే పూర్వకాలంలో దర్శనమిచ్చేది. ఆ తల్లి ఉగ్రరూపాన్ని శ్రీ చక్రం లోకి ప్రతిపాదించి ‘అయిగిరి నందిని నందిత మేథిని అంటూ స్తుతిస్తూ స్తోత్రం చేశాడు శంకరాచార్య స్వామివారు. దీంతో అమ్మవారు శాంతస్వరూపిణిగా సకల జీవకోటిని తన చల్లని చూపులతో అనుగ్రహిస్తోంది. ఈ అమ్మను పూజిస్తే సకల దేవతలను పూజించిన ఫలితం లభిస్తుంది.
అలంకారం: అమ్మవారిని మిరప పండు వర్ణంతో కూడిన పట్టుచీరతో అలంకరిస్తారు.
మంత్రం: ”ఓం ఐం హ్రీం శ్రీం సర్వసమ్మోహిన్యైస్వాహా అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. చండీ సప్తసతి హోమం చెయ్యాలి.
నివేదన: చిత్రాన్నం (పులిహార), గారెలు, వడపప్పు, పానకం నివేదన చెయ్యాలి.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/