‘నీట్’ సాధించ‌లేక మ‌రో విద్యార్థిని బ‌ల‌న్మ‌ర‌ణం

suicide
NEET Student suicide

తిరుచిరాపల్లి: జాతీయ ప్ర‌వేశార్హ‌త ప‌రీక్ష (నీట్)లో మంచి మార్కులు రాలేదన్న మనస్తాపంతో తమళనాడుకు చెందిన మరో విద్యార్థిని ఉసురు తీసుకుంది. వారం రోజుల్లో రాష్ట్రంలో ఇదే తరహా ఆత్మహత్యా ఘటనలు చోటుచేసుకోవడం ఇది రెండోసారి. మెడికల్ కోర్సులో ప్రవేశానికి రాసిన నీట్‌ పరీక్షలో కేవలం 24 మార్కులే సాధించిన శుభశ్రీ కొద్దిరోజులుగా తీవ్ర మనోవేదనకు గురై గత బుధవారం రాత్రి ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. తల్లిదండ్రులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా చికిత్సకు స్పందించలేదని, గురువారం ఉదయం శుభశ్రీ కన్నుమూసిందని వారు తెలిపారు. శుభశ్రీ ఇంటర్‌లో 1200కు 907 మార్కులు సాధించిన తెలివైన విద్యార్థిని అని, నీట్ కోసం కోచించ్ క్లాస్‌లు కూడా వెళ్లేదని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ‘నీట్’లో ప్రవేశం దొరకనందుకు బాధపడవద్దని తామెంతో బతిమాలి చెప్పేవాళ్లమని, ఆమె దష్టిని మరల్చేందుకు బయటకు తీసుకువెళ్లడం, గుడికి తీసుకువెళ్లడం చేసే వాళ్లమని శుభశ్రీ తల్లిదండ్రులు వివరించారు. శుభశ్రీ తండ్రి కన్నన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్‌లో ఉద్యోగం చేస్తున్నారు. తల్లిదండ్రులు ఎంత నచ్చజెప్పినా మెడిసన్ సీటు ఎండమావి కావడం, డాక్టర్ కావాలన్న తన ఆశలకు గండి పడటంతో శుభశ్రీ ఇంత దారుణ నిర్ణయానికి వచ్చినట్టు పోలీసులు చెబుతున్నారు. విషయం తెలిసిన వెంటనే రాష్ట్ర మంత్రి ఎం.ఆర్.విజయ్ భాస్కర్ బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. కాగా, మూడు రోజుల క్రితమే విల్లుపులం జిల్లాకు చెందిన 19 ఏళ్ల ప్రతిభ ‘నీట్’ పరీక్షలో మంచి మార్కులు రాలేదనే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంది. దీంతో గత ఏడాది నుంచి ‘నీట్’ వైఫల్యంతో తమిళనాడులో మృతి చెందిన విద్యార్థినుల సంఖ్య మూడుకు చేరుకుంది.