నిర్మాతగా డిస్ట్రిబ్యూటర్‌గా రెండు బాధ్యతలు

పరిశ్రమలో వరుస విజయాలు దక్కటం అన్నది ఆషామాషీ కాదు. ఎన్నిరకాలుగా జాగ్రత్తలు తీసుకున్నా కూడ వరుస విజయాలు రావు. దానికి చాలా కమిట్మెంట్, ప్లానింగ్, అవగాహన. ముఖ్యంగా ప్రేక్షకులకు ఏం కావాలో తెలిసి ఉండటం ముఖ్యం. అపుడే సక్సెస్ విషయంలో వందశాతం సక్సెస్ సాధిస్తాం. అలా వరుస విజయాలతో పరిశ్రమలో ప్రత్యేక పేరు నిలబెట్టుకున్నారు దిల్‌రాజు. దిల్ రాజు నిర్మాత సక్సెస్ రేట్ ఎక్కువ. ఆయన బ్యానర్ నుంచి సినిమా వస్తుందంటే చాలు. ప్రేక్షకుల్లో భార అంచానాలు ఉంటాయి. హీరోలతో కాకుండా కథకు ప్రాధాన్యత ఇచ్చి సినిమాలు తీయటంలో ఆయన శైలే వేరు. ఈ ఏడాది ఏకంగా 5 సినిమాలతో సక్సెస్ అందుకున్న ఆయన ఆరవ సినిమా కోసం సిద్ధం అయ్యారు. హీరో నానితో తెరకెక్కించిన ‘ఎంసిఎ చిత్రం ఈనెల 21న విడుదల కానుంది. ఈసినిమాతో ఆరో బాల్ కూడ బౌండరీ అని చెబుతున్న దిల్‌రాజు పుట్టినరోజు సందర్భంగా ఆయనతో ప్రత్యేక ఇంటర్వ్యూ విశేషాలు.
ఈ ఏడాది బర్త్‌డే స్పెషల్?
ఈ ఏడాది రెండు రకాలుగా గడిచింది. అటు విజయాలు ఉన్నాయి. ఇటు పరాజయాలు ఉన్నాయి. సినిమాల విషయంలో కానీ నా విషయం మీడియా సపోర్ట్ చాలా ఉంది. దాంతో పాటు దిల్‌రాజు సినిమా అంటే ప్రేక్షకులు ఎక్కువ సపోర్ట్ అందిస్తున్నారు. నేను పరిశ్రమలోకి డిస్ట్రిబ్యూటర్‌గా వచ్చి 22 ఏళ్లయింది. నిర్మాతగా 14వ ఏడాది. ఒక డిస్ట్రిబ్యూటర్‌గా ఈ ఏడాది బ్యాడ్ ఇయర్. నిర్మాతగా ఈ ఏడది సూపర్ హిట్ అలాగే పర్సనల్ లైఫ్‌లో చూసుకుంటే వైఫ్‌ని పోగొట్టుకున్నాను.
డిస్ట్రిబ్యూటర్‌గా ఫెయిల్యూరే అంటున్నారు. కారణం?
ఈ ఏడాది డిస్ట్రిబ్యూర్గా లాస్ అయ్యాను. నా కెరీర్లో ఈ ఏడాదిలో వచ్చిన బ్యాడ్ టైంలో ఎప్పుడు ఇలాంటి పరస్థితి రాలేదు.. డిస్ట్రిబ్యూటర్‌గా ఇపుడు సినిమాలు తీసుకోవాలంటే భయం వేస్తోంది. ఎందుకంటే కొన్ని సినిమాల విషయంలో తప్పులు జరిగాయి. తప్పులు ఎక్కడ, ఎలా జరిగాయనే అనాలసిస్ చేసుకుంటాను. విజయం వచ్చినా. పరాజయం వచ్చినా దాని రెస్పాన్స్ నేను తీసుకుంటా.
మీ దగ్గర చేసిన దర్శకులతోనే మళ్లీ సినిమాలు చేస్తూ ప్రోత్సహిస్తన్నారు కారణం?
నిజానికి ఎంసిఎ దర్శకుడు చేసిన మొదటి ప్రయత్నం ఓ మై ఫ్రెండ్. ఓ ప్రయోగాత్మంగా మొదలుపెట్టాం. కానీ అందులో అనుకోకుండా సిద్ధార్థ్ ఎంటర్ అవ్వటం, ఆ తర్వాత స్టార్ హీరోయిన్స్ రావటంతో ఆ ప్రాజెక్టు భారీగా పెరిగింది. దాంతో అనుకున్న కథ మరోలా మారి సినిమా ఫలితం మరోలా వచ్చింది. అలాగే సునీల్ కృష్ణాష్టమి విషయంలో కూడ అలాగే మార్పులు జరిగాయి.
జోష్ విషయంలో ఎక్కడ తప్పు జరిగిందంటారు?
నిజానికి జోష్ సినిమా విషయంలో కూడ అదే జరిగింది. ఆ సినిమా స్టార్ హీరో కొడుకు లాంచింగ్ సినిమా కాదు. కథ ప్రకారం చూసుకుంటే ఇప్పుడు టివిల్లో బాగా నచ్చుతుంది. కానీ డబ్బు పెట్టే టైం కేటాయించి సినిమా చూసిన జనాలకు నచ్చలేదు. నాగార్జున కొడుకు హీరోగా పరిచయం అవుతున్నాడంటే అంచనాలు ఆ రేంజ్లో ఉంటాయి. దాని ఓవర్కామ్ చేయలేకపోయాం.
ఈ ఏడాది వరుసగా సినిమాలతో సక్సెస్ అందుకుంటున్నారు?
ఇప్పటికే అయిదు సినిమాలతో మంచి విజయాలు అందించారు ప్రేక్షకులు. ఇపుడు నాని హీరోగా వస్తన్న ఎంసిఎ సినిమా కూడ సూపర్‌హిట్ అవుతుందన్న నమ్మకం ఉంది. ఎందుకంటే ఇది వదిన, మరిది స్టోరీ. ఓ మిడిల్‌క్లాస్ మెంటాలిటీ నేపథ్యంలో తీసిన సినిమా. సాయి పల్లవి కూడ అద్భుతంగా చేసింది. ఇక నాని హీరోగా ఈసినిమాలో అద్భుతంగా నటించాడు.
నేను లోకల్ తర్వాత మళ్లీ నానితో చేయటానికి కారణం?
నేనులోకల్ సినిమా సమయంలోనే నానికి ఈ కథ చెప్పటం జరిగింది. కథ నచ్చటంతో నాని ఓకే చెప్పాడు. నాని ఇమేజ్‌కు సరిగ్గా సరిపోయే కథ ఇది. దర్శకుడు కూడ బాగా డీల్ చేశాడు. నాని కెరీర్లోనే బిగ్ హిట్. అవుతుంది.
వరుస విజయాలు అందుకుంటున్నారు. ఆ రహస్యం ?
ఇక్కడ రహస్యం అన్నది ఏమీ లేదు. ప్రేక్షకులకు ఏమి కావాలో ఎలాంటి సినిమాలు కావాలో వాళ్ల పల్స్ ప్రకారం సినిమా తీయాలని అనుకుంటాను. నాతోపాటు మా టీం కూడ సినిమా కథల విషయంలో ఎక్కువ కేర్ తీసుకోవటం జరుగుతుంది. సినిమా విషయంలో ప్రతి విషయంలో జాగ్రత్తగా ప్లాన్ చేస్తుంటాను. శతమానం భవతి, డిజె, రాజా దిగ్రేట్, ఫిదా. ఈఏడాదిలోనే కాదు. నిర్మాతగా నా కెరీర్లో డిజెసినిమాకు వచ్చిన లాభాలు ఏ సినిమాకు రాలేదు.
డిస్ట్రిబ్యూటర్‌గా నష్టాల్లో ఉన్నానని అంటున్నారు?
అవును.. నేను ఎంచుకున్న కథల విషయంలోనే లేక సినిమాల విషయంలో పరిస్థితులు తారుమారైంది. దానివల్ల నాకున్న పేరు కూడ బ్యాడ్ అయింది. నా సినిమాల విషయంలో నేను నిర్మాతగానే కాకుండా డిస్ట్రిబ్యూటర్‌గా రెండు బాధ్యతలు నిర్వహిస్తున్నాను. కాబట్టి ఈ ఇద్దరి పరిస్థితి నాకు తెలుసు. డిస్ట్రిబ్యూటర్ బాగుంటేనే నిర్మాత బాగుంటాడు. ఒక సినిమా పోయిందటే పరిశ్రమ మొత్తంలో ఆ ఎఫెక్ట్ పడేది డిస్ట్రిబ్యూటర్, నిర్మాతకు మాత్రమే. అందుకే నా బిజినెస్ విషయంలో కూడ నేను డిస్ట్రిబ్యూటర్స్‌తో మంచి రాపో కలిగి ఉంటాను. సినిమా బిజినెస్, డబ్బు అన్నది పక్కన పెడితే వాళ్లను నేను బాగా చూసుకుంటేనే కథా నా తదుపరి సినిమాల విషయంలో వారి సపోర్ట్ ఉంటుంది. డిస్ట్రిబ్యూటర్ ఎప్పుడు సక్సెస్‌ఫుల్‌గా ఉంటేనే నిర్మాతకు లాభం. ఫైనల్‌గా నిర్మాతకు డబ్బు వస్తేనే సినిమా సక్సెస్ అయినట్టు లెక్క.
మీ బ్యానర్లో కొత్త దర్శకులతో సినిమా చేయటం లేదు?
కొత్త దర్శకులతో సినిమా ఎప్పుడు ఉంటాయి. అయితే ఆయా దర్శకులు చెప్పిన కథలు బట్టి సినిమా తీయాలా వద్దా అన్నది ప్లాన్ చేస్తా. వచ్చే ఏడాది ఇద్దరు కొత్త దర్శకులను పరిచయం చేస్తున్నాను.
తదుపరి చిత్రాలు?
నితిన్, శర్వానంద్‌లతో మల్టీస్టారర్ చేస్తున్నాను. దాంతోపాటు మహేష్‌బాబు సినిమా ఏప్రిల్‌లో మొదలు కానుంది.