నిరుద్యోగుల‌కు స్వ‌యం ఉపాధికి లోన్స్‌

Career
Career

హైద‌రాబాద్ః ప్రధాన మంత్రి ఉపాధి కల్పనా పథకం నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధిపై భరోసా కల్పిస్తుంది. 2008 లో ప్రధానమంత్రి రోజ్‌గారి యోజన, గ్రామీణ ఉపాధి కల్పన రెండింటిని కలిపి పీఎంఈజీపిగా మార్చటం జరిగింది. గ్రామీణ, పట్టణ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశము. ఈ పథకాన్ని ఎం ఎన్‌ఎంఈ మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్‌ ద్వారా అమలు చేస్తుంది. దీనికి కేవిఐసీ జాతీయ స్థాయిలో నోడల్‌ ఏజెన్సీ, తెలంగాణ రాష్ట్ర పరిధిలో ఈ పథకాన్ని కేవీఐసీ బోర్డులు, డీఐసీలు, జాతీ య బ్యాంకులు అమలు చేస్తున్నాయి. 2016-17 సంవత్సరంలో రంగారెడ్డి జిల్లాలో 803 మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించారు. 53 యూనిట్లకు రూ. 251 కోట్లు సబ్సిడీ అందించారు. మేడ్చల్‌ జిల్లాలో 211 మందికి ఉపాధి కల్పించారు. 13 యూనిట్లకు రూ. 89 కోట్లు సబ్సిడీ ఇచ్చారు. వికారాబాద్‌ జిల్లాలో 25 మదికి ఉపాధి కల్పించారు. రెండు యూనిట్ల కోసం రూ.6 కోట్లు అందజేశారు. 2017-18 సంవత్సరంలో ఉమ్మడిలో ఒక్కో జిల్లాకు 608 మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఉపాధి కోసం ఇప్పటి వరకు రంగారెడ్డి జిల్లాలో 260 మంది నిరుద్యోగులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకున్నారు. అలాగే వికారాబాద్‌ జిల్లాలో సుమారు 150 దరఖాస్తులు, మేడ్చల్‌ జిల్లాలో 300 వరకు దరఖాస్తులు వచ్చాయి. అసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని, ఇది నిరంతర ప్రక్రియని అధికారులు పేర్కొంటున్నారు.