నియామకాలు రెట్టింపు చేయనున్న విప్రో

WIPRO
WIPRO

న్యూఢిల్లీ: దేశంలోని నాలుగో అతిపెద్ద ఐటి సేవల సంస్థ విప్రో ఈ ఏడాది క్యాంపస్‌ నియామకాలు రెట్టింపు చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. క్లైంట్ల నుంచి వస్తున్న కొత్త ఆర్డర్లు, సంస్థను వీడుతున్న ఉద్యోగుల సంఖ్య ఎక్కువ కావడంతో ఏర్పడిన కొరతను ఎదుర్కొనేందుకు సంస్థ ఈ సన్నాహాలు చేస్తున్నట్లు ఎకనామిక్‌ టైమ్స్‌ తన కథనంలో తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరంలో గత మూడు త్రైమాసికాలలో 17శాతంకిపైగా ఉద్యోగులు విప్రో సంస్థను వీడారు. వ్యాపార వృద్ధి మందగిండచం, ఆటోమేషన్‌ కారణాలతో సాఫ్ట్‌వేర్‌ ప్రాజెక్టుల కోసం ఐటి సంస్థలు క్యాంపస్‌ హైరింగ్‌ తగ్గించాయి. విప్రో కూడా కొన్నేళ్లుగా తాజా క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్లను తగ్గించింది. ఈటీ రిపోర్ట్‌ ప్రకారం, విప్రో 10,000కంటే తక్కువ మందిని క్యాంపస్‌ల నుంచి ఎంపిక చేసింది. అయితే ఈ ఏడాది ఆన్‌సైట్‌ హైరింగ్‌ సహా ఈసంఖ్యను రెట్టింపు చేయాలని నిర్ణయించింది. మా నియమకాలు తగ్గాయి. ఇప్పుడు గత కొన్నేళ్లతో పోలిస్తే దీనిని రెట్టింపు చేయనున్నామని విప్రో చీఫ్‌ హ్యూమన్‌ రిసోర్సెస్‌ ఆఫీసర్‌ సౌరభ్‌ గోవిల్‌ అన్నారు. సాఫ్ట్‌వేర్‌ పరిశ్రమలో కొన్నేళ్ల విరామం తర్వాత క్యాంపస్‌ నియామకాలను తిరిగి చేపట్టే లక్షలాది ఇంజనీర్లను ఎంపిక చేస్తున్నట్లు ఆయన చెప్పారు. అత్యున్నత దశలో విప్రో, ఇతర భారతీయ సాఫ్ట్‌వేర్‌ సేవల సంస్థలు కనీసం 20వేల మందిని క్యాంపస్‌ల నుంచి నియమించేవి. ప్రవేశస్థాయి ఉద్యోగాలకు వారి నైపుణ్యాలను అనుసరించి విప్రో రూ.6లక్షలు ఆపైన జీతాలను అందించనుంది. ఫ్రెషర్ల నియామకాలను మూడంచెల్లో చేపట్టనుంది. మొదటి అంచెలో రూ.3.5లక్షలు. మధ్య అంచెలో రూ.6-6.5లక్షలు, ఐఐటి వంటి అత్యున్నత టెక్నికల్‌ యూనివర్సిటీల నుంచి ఎంపిక చేసిన పట్టభద్రులకు రూ.20లక్షల వరకు చెల్లించనుంది. క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా నియమించిన ఉద్యోగులు సంస్థను వీడకుండా ఐదేళ్లకంటే తక్కువ అనుభవం ఉన్నవారైతే గత ఏడాది డిసెంబర్‌లో వన్‌టైమ్‌ బోనస్‌ ప్రకటించింది.