నిదానంగా గమ్యం చేరుకో!

master
Master

నిదానంగా గమ్యం చేరుకో!

”ఎంతెంత దూరం. కొంచెం కొంచెం దూరం అంటూ చిన్నపిల్లలు కళ్లకు గంతలు కట్టుకుని అంతా సందడిగా పరిగెత్తే ఆట మనందరికీ తెలుసు కదా. ఆ ఆటలో ఓ జీవనసత్యం ఉంది. గమ్యం ఎంతో దూరం ఉండవచ్చు. ఎంత దూరమైనా మనం వెళ్లక తప్పదని తెలిసినపుడు ప్రయాణం సాగించాల్సిందే కదా. ఎన్ని వేల మైళ్ల దూరం అయినా మొదట ఒక అడుగుతోనే ప్రారంభిస్తాం కదా. అలా ఒక్కో అడుగు వేసుకుంటూ వెళితే మనం వెళ్లాల్సిన దూరం తగ్గి గమ్యానికి చేరువవ్ఞతాం కదా. అందుకే అంటారు. ”ఎ జర్నీ ఆఫ్‌ థౌజండ్‌ మైల్స్‌ స్టార్ట్‌ విత్‌ ఎ సింగిల్‌ స్టెప్‌ అని. ఇందులో అర్థం ఇపుడు మీకు బోధపడే ఉంటుంది కదా. ఎపుడైనా సరే దూరం ఎంతున్నదన్న విషయాన్ని ఆలోచించకండి.

ఆ దూరాన్ని ఎలా తగ్గించగలమా అన్న విషయం మీదే దృష్టి సారించండి. అపుడే మీ దూరదృష్టి దగ్గర దృష్టి అవ్ఞతుంది. అందుకే దేనికైనా ఉపాయం ఉండాలంటారు. ఉపాయం ఉంటే ఎన్ని అపాయాలనైనా అవలీలగా అధిగమించవచ్చు. మీ దగ్గర చక్కటి ఉపాయం ఉందనుకోండి. మీరెలాంటి సమస్యనైనా చిటికెలో అధిగమించగలుగుతారు. అందుకే తెలివి ఉండాలి. అది ఉంటే ఎంత దూరమైనా మీకు దగ్గరగానే తోస్తుంది. అందినంత దూరంలో ఉన్నట్లే ఉంటుంది. అంతెందుకు. వేసవి సెలవ్ఞలలో మీరేదైనా టూర్‌ ప్లాన్‌ చేసారనుకోండి. చల్లటి ప్రదేశాలు ఊటీ, కొడైకెనాల్‌ అయితే హాయిగా ఉంటుందనుకుంటారు. ఈ ఊరి పేర్లు వినగానే ‘అమ్మో, అవి ఏమన్నా మన ఊరి పక్కన ఉన్నాయా. వెంటనే వెళ్లిపోవ డానికి అనుకుని బాధపడకూడదు.

అలా అనుకుంటే మీ కోరిక ఎప్పటికి తీరుతుంది చెప్పండి. మన జీవితంలో ఏవీ, అన్నీ మన పక్కనే ఉండవ్ఞ. మనకోసం అవి మన దగ్గరికి రానూరావు. చదువు కోవాలంటే పిల్లలు స్కూల్‌కి వెళ్లాల్సిందే. బస్సులోనో, ఆటోలోనో ఏదీ లేకపోతే నడిచైనా వెళ్లకతప్పదు. అలాగే కాలేజ్‌, ఆఫీస్‌, ఇంకా ఒంట్లో బావ్ఞండకపోతే డాక్టరు దగ్గరికి వెళతాం. మన అన్ని అవసరాలకోసం బయట అన్ని చోట్లకు వెళుతూనే ఉన్నాం కదా. మరిక ఇలాంటి విషయాలలో దూరం గురించి ఆలోచించడం ఎందుకు? ఎంత దూరమైనా, ఎక్కడికి వెళ్లాలన్నా అన్నిరకాల ట్రాన్స్‌పోర్టు సౌకర్యాలు విరివిగా ఉన్నాయి కదా. దూరం అనే దురాలోచనను తుడిచిపెట్టేయండి. దూరాలోచన ఉండాలే కానీ అంతా మీ చేరువలోనే ఉంటుందన్న విషయాన్ని స్పష్టంగా తెలుసుకోండి.