నా దగ్గర కూడా అణు బటన్ ఉందిః ట్రంప్

వాషింగ్టన్: ‘అణు బటన్ నా టేబుల్‌పైనే ఉంటుంది’ అని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ చేసిన వ్యాఖ్యలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దీటుగా జవాబిచ్చారు. ‘నా అణు బటన్ కిమ్ కంటే శక్తిమంతమైనదే కాదు అది పని చేస్తుంది కూడా’ అంటూ ఉ.కొరియాను ఉద్దేశించి మాట్లాడారు.
న్యూఇయర్ సందర్భంగా కిమ్ మీడియాతో మాట్లాడాతూ.. అమెరికాను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. తమ దేశంపై అమెరికా తప్పుడు వ్యా్ఖ్యలు చేస్తే తన టేబుల్ పై ఉన్న అణు బటన్‌ను ప్రయోగించాల్సి వస్తుందని అన్నారు. అమెరికా దేశాన్ని అంతమొందించే శక్తి తన అణు ఆయుధాలకు ఉందని తెలిపారు.
ఇప్పటికే ఈ రెండు దేశాల అధ్యక్షులు అణు ప్రయోగాల విషయమై అనేక సార్లు బహిరంగంగానే వాగ్వాదానికి దిగారు. ఇటీవల అమెరికా మిలిటరీ మాజీ చీఫ్ ఉత్తరకొరియాను హెచ్చరిస్తూ వ్యాఖ్యలు చేశారు. అమెరికా యుద్ధానికి సిద్ధమవుతోందని పరోక్షంగా హెచ్చరించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అమెరికా, ఉత్తరకొరియాతో యుద్ధానికి దగ్గరవుతోందని యూఎస్ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ మాజీ ఛైర్మన్ మైక్ ముల్లెన్ అన్నారు.
ఇటీవల ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ట్రంప్ మాట్లాడుతూ..ఉ.కొరియా దేశాన్ని పూర్తిగా నాశనం చేయడం తప్ప తమ వద్ద ఎలాంటి అవకాశం లేదని ట్రంప్ అన్నారు. అప్పటి నుంచే ఇరు దేశాల మధ్య పరిస్థితులు మరింత తీవ్రంగా మారాయి. ట్రంప్ హెచ్చరికలకు ఉ.కొరియా కూడా దీటుగానే బదులిస్తూ వస్తోంది. 2017 నవంబర్‌లో ఆ దేశం అత్యంత శక్తిమంతమైన ఖండాంతర క్షిపణిని ప్రయోగించింది. ఆ ప్రయోగంతో అమెరికా మొత్తం తమ లక్ష్యం పరిధిలోకి వచ్చిందని కిమ్ అన్నారు. 2018లోనూ తాము ఏ మాత్రం మారబోమని.. క్షిపణి ప్రయోగాలు చేస్తూనే ఉంటామని హెచ్చరించారు. ఇదంతా చూస్తుంటే భవిష్యత్‌లో యుద్ధ వాతావరణం కనిపిస్తోంది.