నాయీ బ్రాహ్మణుల సమస్యలు పరిష్కరించాలి

సైఫాబాద్‌,: కేవలం శ్రమశక్తిపై ఆధారపడి జీవిస్తున్న నాయీ బ్రహ్మణుల సమస్యలను తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర నాయీ బ్రాహ్మణ ఐక్య వేదిక డిమాండ్‌ చేసింది. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు, నిరసన కార్యక్రమాలను చేపడతామని వేదిక నాయకులు హెచ్చరించారు. ఈ మేరకు శనివారం ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఒక ప్రతినిధి బృందం రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కోప్పుల ఈశ్వర్‌ను కలిసి వినతి పత్రాన్ని సమర్పించింది. ఈ సందర్భంగా ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఎం.లింగంనాయీ, గౌరవ అధ్యక్షుడు జి.మహేష్‌చంద్రనాయీ తదితరులు మాట్లాడుతూ హైదరాబాద్‌ నగరంలో నాయీ బ్రాహ్మణలకు ఐదు ఎకరాల భూమిని కేటాయించి, భవనం నిర్మాణానికి ఐదు కోట్ల రూపాయలు నిధులు కేటాయించాలని, రాష్ట్రంలోని నాయీ బ్రాహ్మణులందరి తరుపున ఒక ఎమ్మెల్సీని నామినేటేడ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. 2017 మార్చి 14వ తేదీన ప్రగతి భవన్‌లో రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఇచ్చిన హామీ ప్రకారం దేవాలయాల్లోని కళ్యాణకట్టల్లో పనిచేస్తున్న క్షురకులను దేవాలయం ఉద్యోగులుగా గుర్తించాలని, క్షారశాలలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్‌ సరఫరా చేయాలని, 50 సంవత్సరాలు నిండిన వారికి అసరా పథకం కింద పెన్షన్‌ మంజూరు చేయాలని, డబల్‌ బెడ్‌రరూంలు కేటాయించాలని, ఎంబిసి జాబితాలో నాయీ బ్రాహ్మణులను చేర్చాలని, నాయీ బ్రాహ్మణులపై జరుగుతున్న దాడులు, అఘాత్యాలను అరికట్టడానికి ఎస్సీ,ఎస్టీ చట్టం వలే ప్రత్యేక రక్షణ చట్టాన్ని తీసుకురావాలని, హెల్త్‌ కార్డులు పంపిణి చేయాలని వారు కోరారు. తమ సమస్యలపై మంత్రి సానుకూలంగా స్పందించారని వారు తెలిపారు. సమస్యలు పరిస్కరిచకపోతే ఉద్యమం ఖాయమని ఎం.లింగంనాయీ హెచ్చరించారు.