నాయి బ్రహ్మణుల వృత్తి నైపుణ్యానికి రూ.250 కోట్లు: మంత్రి జోగురామన్న

హైదరాబాద్: నాయిబ్రహ్మణులు వృత్తి పరంగా మరింత ముందుకు సాగేందుకు అత్యాధునిక శిక్షణను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న తెలిపారు. శుక్రవారం సంక్షేమ భవన్లో ఏర్పాటు చేసిన నాయి బ్రహ్మణుల శిక్షణా కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోటీ ప్రపంచంలో కుల వృత్తిదారులు రాణించాలంటే వారికి మెరుగైన అత్యాధునిక శిక్షణ అవసరం అని అన్నారు. నాయి బ్రహ్మణుల వృత్తి నైపుణ్యం, సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా రూ.250 కోట్లు మంజూరు చేసిందన్నారు. ఈ నిధులను నాయి బ్రహ్మణుల సంక్షేమం కోసం వెచ్చించనున్నట్లు తెలిపారు. ఈ వృత్తిలో మహిళలకు నూతన టెక్నాలజీలో శిక్షణ ఇచ్చి సంచార బ్యూటీ పార్లర్లను ఏర్పాటు చేయించనున్నట్లు తెలిపారు. నాయిబ్రహ్మణులతో పాటు రజక సంక్షేమం కోసం కూడా ప్రభుత్వం రూ.250 కోట్లు మంజూరు చేసిందన్నారు. అత్యాధునిక శిక్షణను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు. ఈ కార్యక్రమంలో ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, బీసీ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి అశోక్ కుమార్, అదనపు కార్యదర్శి సైదా, బీసీ సంక్షేమ శాఖ అదనపు సంచాలకులు కె.అలోక్ కుమార్, బీసీ గురుకులాల సంస్థ కార్యదర్శి మల్లయ్య భట్టు, నాయిబ్రహ్మణ ఫెడరేషన్ ఎండీ చంద్రశేఖర్, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ రాజశేఖర్, జాయింట్ డైరెక్టర్ రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.