నామసాధన

Swamy Sundara Chaitanyananda
Sundara Chaitanyananda

నామసాధన

నోరులేనివారు, ఊరులేనివారు ఉండొచ్చేమో గాని పేరు లేనివారుండరు. అందరికీ పేర్లు ఉంటాయి. నామకరణం జరగకపోయినా ఎవరో ఒకరు నామం పెడతారు. ఆ తరువాత ఆ నామంతో అందరూ పిలుస్తారు. పేరు అనేది పేరుకు మాత్రమే కాదు. అందులో ఎంతో శక్తి ఉంది. మనం ప్రాణ తుల్యంగా ప్రేమించే వారి నామాన్ని ఎవరైనా పలికితే మనం ఆనందంతో చలించిపోతాం. అలాగే శత్రువ్ఞ పేరును ఎవరైనా ప్రస్తావిస్తే, వెంటనే కుంచుకుపోతాం. ఇదంతా ఏమిటి? నామమాత్రం అంటే సరిపోదు.

పేరులో అంత శక్తి పేరుకుపోయి ఉంది. ఈ విధంగా కొన్ని నామాలపై మనకు రాగముంది. మరికొన్ని నామాలపై ద్వేషముంది. రాగద్వేషాలు బ్రతుకును కుదిపేస్తాయి. ఈ బాధ నుంచి బయటపడాలి అంటే భగవన్నామాన్ని ఆశ్రయించటం ఒక్కటే మార్గం. భగవన్నామం పరమ ప్రేమ రూపం. రాగద్వేషాల పరిధిలోకి అది రాదు. మనస్సును భగవ న్నామం పవిత్రం చేస్తుంది. బుద్ధిలో ప్రశాంతతను దించుతుంది. శాంతిసాగరంలో ముంచేస్తుంది. అమృతత్వాన్ని ప్రసాదిస్తుంది. ఈ మహత్కార్యాన్ని సాధించే ప్రయత్నంలో అనామవిధేయునికి అనంతనామాలు ఏర్పడ్డాయి. ”నాయనా! శ్రద్ధగా చదువ్ఞకో! బుద్ధిగా మసలుకో. భవిష్యత్తులో గొప్ప పేరు తెచ్చుకోవాలి అని బిడ్డలతో చెబుతూ ఉంటారు తల్లిదండ్రులు. గొప్ప పేరు తెచ్చుకోవట మంటే ఏమిటో పసితనంలో ఏమి తెలుస్తుంది? పెరిగినపుడు తెలుస్తుంది.

బుద్ధి పెరిగినపుడు అర్థమవ్ఞతుంది. గొప్పపేరు తెచ్చుకోవటమంటే భగవన్నామాన్ని సంపాదించుకోవటమేనని. నామరూపాత్మకం హి ఇదం సర్వం ఈ ప్రపంచమంతా నామరూపాత్మకమే. ప్రపంచంలోని నామరూపాలు మనలో రాగద్వేషాలను రెచ్చగొట్టి బ్రతుకును అనుక్షణం భగ్నంచేస్తూ ఉంటాయి. కాని, భగవద్రూపం, భగవన్నామం రాగద్వేషాల్ని అదృశ్యం చేసి, మనలో జ్ఞానాన్ని దింపుతాయి. అలౌకిక ఆనందాన్ని ప్రసాదిస్తాయి. రూపం కన్నా నామం మనస్సులో చక్కగా తిష్టవేస్తుంది.

అలా చూచినపుడు రూపం, అనిత్యం నామం నిత్యం అనాలి. మనిషి ప్రపంచంలో ఎంతో కాలం నిలవలేడు. కాని, పేరు ఎంతకాలమైనా ఉంటుంది. అలాంటప్పుడు భగవన్నామం వైభవం ప్రత్యేకించి చెప్పాలా? నామసాధన అద్భుతమైంది. విలువైనదే కాదు, సులువైనది కూడా. మనస్సున్న వారికే తెలుస్తుంది మంత్ర మహిమ. నామసాధనకు సమయాలు లేవ్ఞ. నియమాలు లేవ్ఞ. ఎవరైనా చెయొచ్చు. ఎక్కడైనా చెయొచ్చు. వయోభేదం లేదు. లింగ భేదం లేదు. నామసాధనలో మరొకరి ప్రమేయం ఉండదు.

ఇంకొకరి సహాయం అవసరం ఉండదు. ఇది కేవలం భక్తునికి, భగవంతునికి మధ్య నడిచే వ్యవహారం. అస్య స్తుతి లక్షణస్య అర్చనస్య ఆధిక్య కిం కారణం? ఉచ్చతే హింసాది పురుషాంతర ద్రవ్యాంతర దేశకాలాది నియమ అనపేక్షత్వం ఆధిక్యే కారణం. ఇది.”నామసాధనకు ధనమవసరం లేదు. జనమవసరం లేదు. దేశకాలాదులతో పనిలేదు. నియమ నిబంధనలతో అసలే పనిలేదు. నామసాధనలో హింస తలెత్తదు అన్నారు భాష్యంలో శ్రీ శంకరాచార్యస్వామి. అందుకనే నామసాధనను గొప్ప యజ్ఞంగా అభివర్ణించారు గీతలో శ్రీకృష్ణ పరమాత్మ. ”యజ్ఞానాం జపయజ్ఞోస్మి యజ్ఞాలలో నేను జపయజ్ఞమును అన్నారు గీతలో. నామస్మరణ వలన భగవద్భక్తి వృద్ధి చెందుతుంది. భగవత్ప్రేమ లభిస్తుంది. భక్తి వలన భగవత్కృప ప్రాప్తిస్తుంది. భగవత్కృప జ్ఞానాన్ని ప్రసాదించి, ముక్తిని సిద్ధింప చేస్తుంది.

– స్వామి సుందరచైతన్యానంద