నాకేసు సంచలనం అవుతుందనుకోలేదు!

TMC
TMC

న్యూఢిల్లీ: ఎస్‌సిఎస్టీ అత్యాచారాల నిరోధకచట్టంపై తాను దాఖలుచేసిన ఫిర్యాదు రాజకీయ ధుమారంలేపుతుందని తాను ఎప్పుడూ ఆలోచించలేదని ఫిర్యాది భాస్కర్‌ గైక్వాడ్‌ పేర్కొన్నారు. 2007లో తాను దాఖలుచేసిన ఫిర్యాదు ఆధారంగానే ఎస్‌సిఎస్టీ కేసుపై సుప్రీం విచారణజరిగి తీర్పు వచ్చిందని ఆయన అన్నారు. తన న్యాయపోరాటం రాజకీయదుమారం లేపుతుందని తాను భావించలేదన్నారు. 53ఏళ్లప్రభుత్వ కళాశాల ఉద్యోగి పూణెకు చెందినవారు. కేంద్ర ప్రభుత్వప్రతిపాదనతో నిమిత్తం లేకుండా ఈనెల 19వ తేదీ తాను మరొక రివ్యూపిటిషన్‌ దాఖలుచేస్తానని న్రపకటించారు. ఎస్‌సిఎస్టీ చట్టం నిర్వీర్యం చేసేవిధంగా సుప్రీంకోర్టు తన గతనెల 20వ తేదీ తీర్పుపై సమీక్ష కోరతానన్నారు. ముందురోజే కేంద్ర ప్రభుత్వం రివ్యూపిటిషన్‌ దాఖలుచేసింది. దేశవ్యాప్తంగా ఈ తీర్పుతో మరింతగా విధ్వంసం చెలరేగిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ రివ్యూ పిటిషన్‌కు దూరంగా ఉన్న గైక్వాడ్‌ మాట్లాడుతూ ఈరూలింగ్‌ వచ్చిన కేసులో తాను ప్రతివాదిగా ఉన్నానని అందువల్ల తాను పునఃసమీక్ష చేయాలని కోరుతూ పిటిషన్‌దాఖలుచేస్తానని, నెలరోజులలోపు దాఖలుచేసే అవకాశం ఉందని ఆయన అన్నారు. రాజకీయరంగు పులుముకున్న వాతావరనంపై ఆయన వ్యాఖ్యానించేందుకు నిరాకరించారు. ప్రతిపక్ష పార్టీలు నరేంద్రమోడీప్రభుత్వాని నిందిస్తున్న సంగతి తెలిసిందే. నేనొక ప్రభుత్వ ఉద్యోగిననని, రాజకీయంగా తానేమీ చెప్పలేనని రాజకీయంగా జరుగుతున్న పరిణామాలుగా తాను భావించడంలేదని ఆయన అన్నారు. 2007లో దాఖలుచేసిన ఫిర్యాదు ఆధారంగానే సుప్రీంకోర్టుకు కేసు వచ్చిందని అన్నారు. కరద్‌లోని ఫార్మసీ కళాశాలలో ఒక స్టోర్‌కీపర్‌గా పనిచేస్తున్న భాస్కర్‌ గైక్వాడ్‌ పలు ఆరోపణలు చేసారు. కొన్ని డాక్యుమెంట్లు ఫోర్జరీచేయాలని తనపై సీనియర్ల ఒత్తిడి వచ్చిందన్నారు. తాను నిరాకరించడంతో అగ్రవర్ణ కళాశాల ప్రముఖులు తన రహస్యనివేదికలో ప్రతికూలంగా వ్యాఖ్యలుచేసారని గైక్వాడ్‌ పేర్కొన్నారు. 2009 సెప్టెంబరులో ఒక ఫిర్యాదుచేసానని, సాంకేతిక విద్యాశాఖ టెక్నికల్‌ డైరెక్టర్‌ ఉభాష్‌ మహాజన్‌ వద్ద ఫిర్యాదుచేశానన్నారు. గైక్వాడ్‌ వివరాలప్రకారం మహాజన్‌నుంచి తనకెలాంటి సాయం రాలేదని దీనితోతాను జాయింట్‌ డైరెక్టర్‌పై కూడా ఫిర్యాదుచేసానన్నారు. తదనంతరం మహాజన్‌ కోర్టును ఆశ్రయించి తనపై దాఖలయిన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని కోరినట్లు గైక్వాడ్‌ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం మహాజన్‌కు పూర్తిగా మద్దతిచ్చిందని, హైకోర్టు విచారణలో సైతం తనకు న్యాయం జరగలేదన్నారు. మహాజన్‌ కూడా సుప్రీంకోర్టువరకూ వెళ్లారు. దీనిపైనే సుప్రీం మార్చి 20వ తేదీ తుదితీర్పు అంటే రూలింగ్‌ఇచ్చింది. ప్రభుత్వ అధికారులు ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి అరెస్టులు చేయకూడదని, ప్రైవేటు వ్యక్తులైనా అదే జరగాలని సూచించింది. విచారణలో రాష్ట్ర ప్రభుత్వం తనకు సహకరించలేదని గైక్వాడ్‌ పేర్కొన్నారు. 20వ తేదీ తీర్పుపై గైక్వాడ్‌ మాట్లాడుతూ తానెలాంటి వ్యాఖ్యలుచేయలేనని అన్నారు. అయితే తాను రివ్యూపిటిషన్‌ దాఖలుచేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. ఈ తీర్పు మహాజన్‌కు అనుకూలంగా ఉందని మహారాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ఆయనకు మద్దతిచ్చిందన్నారు. ఏడాదిపాటు మహాజన్‌పై ఛార్జిషీటు దాఖలుచేయలేదని, సరికదా తనకు న్యాయపరమైన సాయం కూడా చేయలేదని, ఎస్‌సిఎస్టీ చట్టంలో ఈ అవకాశం ఉందని గైక్వాడ్‌ వెల్లడించారు. అయితే ఈ వ్యవహారంపై వ్యాఖ్యానించేందుకు మహాజన్‌ నిరాకరించారు. మీకేదితోస్తే అదే రాసుకోండి. అవసరమైనపుడు మాత్రమే తాను స్పందిస్తానని మహాజన్‌ వెల్లడించారు.