నవంబర్‌ 2 కాంగ్రెస్‌ జాబితా?

Congress Party
Congress Party

40 మందితో విడుదలకు యోచన
హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలకు సమయం దగ్గర పడుతుండటంతో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల ప్రకటనకు రంగం సిద్ధం చేసింది. మరో రెండు రోజుల్లో తొలి జాబితా విడుదల చేయనుంది. ఇప్పటికే పార్టీ పక్షాన పోటీ చేయనున్న ఆభ్యర్థుల జాబితాను రాష్ట్ర నాయకత్వం సిద్ధం చేసింది. అయితే, మహా కూటమి భాగస్వామ్య పక్షాలైన టిడిపి, సిపిఐ, టీజేఎస్‌ పార్టీల మధ్య పొత్తుల వ్యవహారం ఇంకా కొలిక్కి రాకపోవడంతో జాబితా ప్రకటనలో జాప్యం జరిగింది. అయితే, సీట్ల వ్యవహారాన్ని త్వరగా తేల్చాలని సిపిఐ, టీజేఎస్‌ నుంచి తీవ్ర స్థాయిలో ఒత్తిడి వస్తుండటంతో ఒకవేళ ఆ వ్యవహారం కొనసాగుతున్నప్పటికీ ఎలాంటి వివాదం, భాగస్వామ్య పక్షాలతో సంబంధం లేని జాబితాను ముందుగా విడుదల చేయాలని కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం భావిస్తోంది. దీంతో నవంబర్‌ 2ను జాబితా విడుదలకు ముహూర్తంగా నిర్ణయించినట్లు తెలిసింది. గత మూడు రోజులుగా కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల ఎంపికకు ఏఐసిసి నియమించిన సీనియర్‌ నేత భక్తచరణ్‌దాస్‌ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల కమిటీ దాదాపు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసింది. దీంతో ఈ వ్యవహారం తుది దశకు చేరినట్లయింది. కాగా, సోమవారం గోల్కోండ రిసార్ట్స్‌లో ఏఐసిసి స్క్రీనింగ్‌ కమిటీతో పార్టీ ముఖ్య నేతలు టీ పీసీసీ చీప్‌ ఉత్తమ్‌, మధుయాష్కి, వీహెచ్‌, పొన్నాల లక్ష్యయ్య భేటీ అయ్యారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో టికెట్ల కేటాయింపుపై బీసీ నేతలతో మాట్లాడారు. పార్టీ పక్షాల పోటీ చేసే అభ్యర్థుల ప్రకటనకు నెల రోజుల సమయం సరిపోతుందనీ, ప్రచారానికి మరో నెల రోజుల సమయం చాలని టీ పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. అయినప్పటికీ అంతకు ముందుగానే అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసి ప్రచార పర్వంలోనికి దింపాలని పార్టీ అధిష్టానం యోచిస్తోంది. సిట్టింగ్‌ స్థానాలతో పాటు పార్టీ అభ్యర్థులకు విజయావకాశాలు ఉన్న స్థానాలను పొత్తులలో భాగంగా ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దని ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పార్టీ రాష్ట్ర నాయకత్వానికి స్పష్టం చేశారు. ఇందులో భాగంగా పార్టీ గెలిచే అవకాశాలు ఉన్న స్థానాలు పోను కూటమి భాగస్వామ్య పార్టీల సిట్టింగ్‌ స్థానాలను వాటికే వదిలి వేయాలనీ, ఇక ఆ పార్టీలు బలంగా ఉన్న స్థానాలను కూడా కేటాయించాలనీ, దీంతో తొలి జాబితా విడుదలకు మార్గం సుగమం అవుతుందని పార్టీ రాష్ట్ర నాయకత్వం భావిస్తున్నట్లు తెలిసింది.