నగరం వెలుపల బస్‌ టెర్మినల్స్‌!

TSRTC
TSRTC

హైదరాబాద్‌: నగరానికి తలనొప్పి తెప్పించడంలో ముందుండేది ట్రాఫిక్‌ సమస్య. ట్రాఫిక్‌ ఫ్రీ సిటీగా చేసేందుకు ఆర్టీసి తనవంతు ప్రయత్నాన్ని చేపట్టింది. జిల్లాల నుంచి వచ్చే బస్సులను ఇన్నర్‌ రింగ్‌రోడ్డు అవతలి నుంచే తిప్పి పంపేందుకు కసరత్తు మొదటుపెట్టింది. ఈ మేరకు ఇన్నర్‌ రింగ్‌ రోడ్డును ఆనుకుని బస్‌టెర్మినల్స్‌ నిర్మించి అక్కడి నుంచే ఆపరేటింగ్‌ చేయాలని ఆర్టీసి భావిస్తున్నది. దీనికోసం టిఎస్‌ఆర్టీసి నగరంలో స్థలాలను అన్వేషిస్తున్నది. ఐతే అంతరాష్ట్ర సర్వీసులకు మాత్రం ఎంజిబిఎస్‌, జేబిఎస్‌ స్టేషన్ల వరకు అనుమతించి జిల్లా కేంద్రాలు, రాష్ట్రంలోని ప్రధాన ప్రాంతాల నుంచి రాకపోకలు సాగించే బస్సులను శివార్లకే పరిమితం చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఐతే ఈ టెర్మినల్స్‌ వద్దనే జిల్లా నుంచి వచ్చే బస్సులు ప్రయాణికులను దింపివేస్తాయి. అక్కడి నుంచి బస్సు దిగిన తర్వాత తమ గమ్య స్థానాలకు చేరేవరకు సిటీ బస్సులు అందుబాటులో ఉంటాయి. సూపర్‌లగ్జరీ, రాజధాని ఏసి, గరుడ, గరుడ ప్లస్‌ బస్సుల్లో ప్రయాణించిన బస్సు టికెట్‌ సిటీ బస్సులో కూడా చెల్లుతుంది. ఇప్పటికే ట్రావెల్‌ బస్సుల ఆపరేటింగ్‌ను ఔటర్‌ రింగ్‌ రోడ్డు అవతలి నుంచి ఆపరేట్‌ చేయాలని భావిస్తున్నారు.