నకిలీ విత్తనాలు లేకుండా చేయడమే లక్ష్యం: పార్థసారధి

Parthasaradhi
Parthasaradhi

హైదరాబాద్‌: నకిలీ విత్తన బెడద లేకుండా చేయడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెళుతోందని వ్యవసాయ శాఖ కార్యదర్శి సి పార్థసారధి అన్నారు. రైతులు సంక్షేమం కోసం అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. హైదరాబాద్‌ హాకా భవన్‌లోని రాష్ట్ర విత్తన, సేంద్రీయ దృవీకరణ అథారిటీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన సమావేశంలో కార్యదర్శి మాట్లాడుతూ విత్తన భాండాగారమైన తెలంగాణ రాష్ట్రంలో కల్తీ, నకిలీ విత్తనాలకు తావులేదన్నారు. గద్వాల జిల్లాకు చెందిన పత్తి విత్తన ఆర్గనైజర్లు, విత్తన పరిశ్రమ ప్రతినిధులు, నిరాకరించిన విత్తన లాటుల విడుదల విషయమై చర్చించినట్లు ఆయన వివరించారు. ప్రైవేటు పత్తి విత్తన కంపెనీలు ఉమ్మడి గద్వాల జిల్లాలో గ్రో అవుట్‌ టెస్ట్‌ పేరుతో విత్తనోత్పత్తి రైతులకు అన్యాయం చేస్తున్నాయని ఈ సమావేశంలో తమ దృష్టికి తీసుకువచ్చారని చెప్పారు. బీటీ పత్తి విత్తనం జన్యుమార్పుడి చేత అభివృద్ధి చేసిన విషపూరిత విత్తనాలని, అందువల్ల బీటీ వంగ, బీటీ ఆవాలు విత్తనాలకు కేంద్రం ఇంకా అనుమతి ఇవ్వలేదని వెల్లడించారు. నిరాకరించిన విత్తనాలు పశు దాణాకు, నూనెలకు సైతం వాడకూడదని స్పష్టం చేశారు. వాటిని ధ్వంసం చేయాలని తేల్చిచెప్పారు. విత్తన కంపెనీలతో సమావేశమై ఈ విషయంపై మరోమారు భేటీ అయి నిరాకరించిన విత్తన లాటులను ఏం చేయాలనేదానిపై నియమనిబంధలను రూపొందిస్తామని కార్యదర్శి చెప్పారు.