ధర్మమున్న చోటే దైవం

                             ధర్మమున్న చోటే దైవం

Lord krishna
Lord krishna

ధర్మం అనేది వివేకానికి సంబంధించిన విషయం. పశుపక్ష్యాదులు వివేకం లేక, కేవలం సహజాతాలపై ఆధారపడి యాంత్రికమైన జీవనాన్ని కొనసాగిస్తున్నందున అవి ధర్మమనే పవిత్రమైన పురుషార్థానికి నోచుకోవ్ఞ. కామం గాని, అర్థం గాని ప్రాణులలో తలెత్తినపుడు తమ సుఖానికి, లేదా తమ రక్షణకి అన్యప్రాణులను ఉపయోగించుకోవడం కనిపిస్తూ ఉంటుంది. ఇలా ఇతరులను తమ సుఖాలకు ఉపయోగించుకొనే వాంఛ తీవ్రమైనపుడు అది హింసగా పరిణమిస్తుంది. ఇలాంటివి జంతు ప్రపంచంలో చూస్తూ ఉంటాము. అలాగని వాటిని తప్పు పట్టలేము.

వాటికి వివేకము లేదు. అందుచేత అంతకన్నా భిన్నంగా, గొప్పగా జీవించలేవ్ఞ. ఇక్కడే మనిషి విశిష్టత. మనిషి తన సుఖానికై యత్నించవచ్చు. కాని, అది మరొకరి సుఖాన్ని పాడు చేయకూడదు. నేనెలా సుఖించాలనుకుంటున్నానో ఇతరులు కూడా అలాగే సుఖపడాలి అని అనుకుంటున్నాను. కనుక, నేను సుఖపడతాను. అంతేకాదు, ఇతరుల సుఖానికి అడ్డు నిలవను. ఇది ధర్మం. నా ఆస్తిని ఇతరులు అపహరిస్తే నేను భరించలేను. కనుక, ఇతరుల ఆస్తిని నేను అపహరించకూడదు. ఇది ధర్మం. ఒకరు నన్ను శారీరకంగా లేదా మానసికంగా గాయపరిస్తే నేను వ్యధ చెందుతున్నాను.

నా విషయంలో ఇతరులు ఎలా ప్రవర్తించకూడదని నేను భావిస్తున్నానో ఇతరుల విషయంలో నేను అలా ప్రవర్తించకుండా ఉండాలి. ఇది ధర్మం. ఈవిధమైన ధర్మబద్ధమైన జీవనం వలన వ్యక్తికి, సమాజానికి న్యాయం జరుగుతుంది. ఈ ప్రవర్తనను క్రమపరచేందుకు చట్టాలు న్నాయి. ప్రభుత్వాలున్నాయి. సెక్యులర్‌ వ్యవస్థ సరిపోతుంది. కాని, మత ధర్మాలెందుకు? అనే ప్రశ్న ఉద్భవిస్తుంది. దారి తప్పిన వారిని సంస్కరించేందుకే చట్టాలున్నాయి. ఇవి మానవ నిర్మితాలు. కాని, దారి తప్పిన మనిషి చట్టాన్ని కూడా తప్పించుకొ నేందుకు ప్రయత్నిస్తాడు. చట్టం కన్ను కప్పేస్తే తాను ఎవరికంట పడకుండా సుఖించవచ్చు అనుకుంటాడు. చట్టాన్ని తప్పుకోవచ్చు. ధర్మాన్ని, దైవాన్ని తప్పుకోలేవ్ఞ అంటూ మతం ప్రవేశిస్తుంది.

ఈ ప్రపంచంలో స్థూలంగా కర్మలు చేస్తాం. ఆ కర్మలు చేయాలి అనే సంకల్పం మొదట సూక్ష్మంగా ఉంటుంది. ఈ విధంగా ప్రతికర్మకు స్థూల సూక్ష్మరూపాలుంటాయి. స్థూలకర్మకు స్థూలఫలితమున్నట్లు, సూక్ష్మకర్మకు సూక్ష్మఫలిత ముంటుంది. ఈ సూక్ష్మఫలితాలే పాపపుణ్యాలు. ఇవి మానవ్ఞలు చేతిలో ఉండవ్ఞ. దైవాధీనములు. కనుక చట్టాన్ని మనిషి తప్పిం చుకోవచ్చు. పాపాన్ని తప్పించుకోలేడు. అలాగే చట్టం ద్వారా మనిషికి న్యాయం జరగకపోవచ్చు. కాని, పుణ్యఫలం నిరీక్షిస్తూనే ఉంటుంది. కనుక, పశుపక్ష్యాదుల వలె కాకుండా ధర్మబద్ధంగా మానవ్ఞలు చరించాలి. దైవమే ధర్మాల రూపంలో ఉన్నందున ధర్మాన్ని రక్షించినవారు దైవం చేత రక్షింపబడతారు. ధర్మజీవనం మనిషికి సుఖాన్ని ప్రసాదిస్తుంది.

ఒక పేదవాడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని తెలిసి, అతనికి సాయం చేసి అతడిని బ్రతికించగలిగామనుకోండి. ఆ క్షణంలో మన మనసు ఎంత సంతోష పడుతుంది? ఇది సుఖం కాదా? అయితే, ఇది కామం లాంటి సుఖం కాదు. అర్థం లాంటి సుఖం కాదు. తనకు వ్యక్తిగతంగా ఏమి లభించ కున్నా సుఖించే ఆంతరంగిక స్థితి. ఇది ధర్మం పెట్టిన భిక్ష. ధర్మం నీడలో నిలిచి సుఖించే పుణ్యాత్ములకు కష్టాలు కూడా సుఖాలుగానే తెలుస్తాయి. ధర్మం కొరకు రాముడు కానలకేగాడు. ధర్మం కొరకు పాండవ్ఞలు అష్టకష్టాలు పడ్డారు. ధర్మం కొరకు శిబిచక్రవర్తి తన దేహాన్నే కోసిపెట్టాడు.

ధర్మం కొరకు దధీచి తన శరీరాన్ని దగ్ధం చేశాడు. ధర్మ కార్యాచరణలో తనకు ప్రత్యేక సుఖం అవసరం లేదు. అందరూ సుఖపడే కార్యం కనుక అందరి సుఖంలో తన సుఖం కూడా నిలిచి ఉంది. ఒకవేళ అట్టి ధర్మాచరణం వలన తాత్కాలికంగా తనకు అసౌకర్యం ఏర్పడినా, అది పదిమందికి సౌకర్యాన్ని కల్పిస్తున్నదనే భావనలో తన అసౌకర్యం సౌకర్యంగా మారిపోతుంది. సుఖంగా మారిపోతుంది. రాత్రింబవళ్లకు తేడా తెలియకుండా, లోకకళ్యాణానికి కంకణం కట్టుకుని మహాత్ములు ధర్మప్రచారములో నిమగ్నమై ఉంటారు. ఆహార నిద్రాదులు కూడా మరచిపోతారు. వారి దేహం సహజ ధర్మాలకు లోబడి అనార్యోగానికి గురి అయినా వారి హృదయం నిత్యానందంతో పరవళ్ళు త్రొక్కుతూ ఉంటుంది.

ఈ విధంగా అర్థ, కామ, ధర్మాలనే మూడు పురుషార్థములలో ధర్మము విశిష్టమైనందున దానికి అగ్రస్థానమిచ్చి ధర్మార్థ కామములనెడి త్రివర్గములలో ధర్మానికే ప్రథమ స్థానమిచ్చాడు. అర్థకామాలను పొందాలనుకొనేవారు ధర్మానికి మొదటిస్థానం ఇవ్వాలి. అప్పుడు అర్థకామాలు మనిషిని బంధించవ్ఞ. ధర్మంతో కూడిన కామం, ధర్మబద్ధమైన అర్థం సుఖశాంతుల్ని పెంపొందిస్తాయి. ధర్మం తోడుగా ఉన్నది కనుక దైవం తోడుగా ఉన్నట్లే. ‘ధర్మమునకు విరుద్ధము కాని కామము నేను అని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత -7వ అధ్యాయము విజ్ఞానయోగంలో తెలిపారు.
– చైతన్యానంద