ద‌క్షిణాఫ్రికాతో మొద‌టి వ‌న్డే నేడే

Team india
Team india

డ‌ర్బ‌న్ః రెండున్నర దశాబ్దాలు..నాలుగు ద్వైపాక్షిక సిరీస్‌లు, రెండు ముక్కోణపు టోర్నీలు..దక్షిణాఫ్రికాతో తలపడ్డ మ్యాచ్‌లు 28..భారత్ గెలిచినవి 5. మొత్తంగా సఫారీ గడ్డపై టీమ్‌ఇండియా వన్డే రికార్డు ఇది. టెస్ట్ సిరీస్ విషయంలోనే కాదు వన్డే సిరీస్ గెలిచే దాంట్లోనూ భారత్‌కు ఇన్నాళ్లు నిరాశే ఎదురైంది. కెప్టెన్లు మారారు, ఆటగాళ్లు మారారు, కానీ సిరీస్ గెలుపే మనకు అందకుండాపోయింది. మరి ఇప్పటికైనా సిరీస్ దక్కించుకోవాలన్న పట్టుదలతో కోహ్లీసేన బరిలోకి దిగుతున్నది. వాండర్సర్ విజయమిచ్చిన ఆత్మవిశ్వాసంతో టీమ్‌ఇండియా..దక్షిణాఫ్రికాను నిలువరించేందుకు సిద్ధమైంది. ఇక వన్డేల్లో వరుసగా 17 విజయాలతో జోరుమీదున్న దక్షిణాఫ్రికా..అదే ఊపులో టీమ్‌ఇండియాను ఓడించేందుకు పక్కా ప్రణాళికను ఎంచుకున్నది. సొంతగడ్డపై ఆడిన గత 19 మ్యాచ్‌ల్లో సఫారీలు 17 విజయాలు సాధించారంటే వారి ఫామ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. చేతివేలు గాయంతో డాషింగ్ బ్యాట్స్‌మన్ డివిలీయర్స్ మొదటి మూడు వన్డేలకు దూరం కావడం దక్షిణాఫ్రికాను కొంత కలవరపెడుతున్నది. మొత్తంగా వన్డేల్లో టాప్‌లో కొనసాగుతున్న దక్షిణాఫ్రికా(121), భారత్(119) మధ్య హోరాహోరీ పోటీ అభిమానులను కనువిందు చేయనుంది.