ద్రాక్షలో విటమిన్‌

Grapes
పుల్లపుల్లగా ఉన్నా…తలచుకోగానే చవులూరిస్తాయి ద్రాక్షపళ్లు. రుచి ఒక్కటే కాదు. శరీరానికి మేలు చేసే గుణాలు ఈ అద్భుత ఫలానికి చాలానే ఉన్నాయి. ద్రాక్షలో విటమిన్‌ ఎ, సి, బి6, పొటాషియం, మాంగనీస్‌, థయామిన్‌లు పుష్కలంగా ఉంటాయి.

గుప్పెడు గుండెకు ద్రాక్షే శ్రీరామరక్ష అని పరిశోధనలు చెబుతున్నాయి. ఇందులో ఉండే రెస్‌వెరాట్రాల్‌ అనే పాలీఫెనాల్‌ యాంటాక్సిడెంట్‌కు రక్తనాళాల్లో రక్తం గడ్డలు కట్టకుండా నిలువరించే సామర్థ్యం ఉంది. కేన్సర్‌, వైరల్‌ ఇన్‌ఫెక్షన్లూ నరాల వ్యాధులనూ సమర్థంగా అడ్డుకుంటుంది. బీపిని అదుపులో పెట్టే మంచి ఔషధం ద్రాక్ష. హైబీపీ ఉన్నవారు రాత్రిపూట పడుకోబోయే ముందు ఒక కప్పు తాజాద్రాక్ష రసం తాగితే మంచిది. ద్రాక్షరసాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే కడుపులో పుండ్లు క్రమేపీ తగ్గుముఖం పడతాయి.

మాంసం అధికంగా తినే ఫ్రెంచివారిలో గుండెజబ్బుల రేటు అతి తక్కువ. విషయమేంటా అని పరిశోధిస్తే వారు సేవించే మదిరే గ్రేప్‌వైన్‌ అందుకు కారణమని తేలింది.

ఫ్రెంచ్‌ పారడాక్స్‌గా ఈ పరిశోధన చరిత్రలో  నిలిచిపోయిందంటే ద్రాక్ష గొప్పదనాన్ని అర్థం చేసుకోవచ్చు.

దంత క్షయం ఉన్నవారు ద్రాక్షపండ్లకు దూరంగా ఉండటమే మంచిది. ఒకవేళ తిన్నా నీళ్లతో నోటిని పుక్కిలిస్తే మంచిది.