దేహమే దేవాలయం

ధర్మ సాధన కొరకు శరీరం అవసరం. అందుకోసమే, శరీర మాద్యం భిలు ధర్మసాధనం అని ఆర్యోక్తి. ఇంతవరకు జరిగిన సృష్టి వికాస క్రమంలో జడం నుంచి జీవం అవతరించినట్లే, జీవం నుంచి దైవం అవతరించడం తథ్యం అని అరవిందుడు ప్రవచించారు. కనుక మోక్ష సాధనకు మానవ శరీరం భగవంతుడు ప్రసాదించిన ఒక అద్భుత వరం. కనుక మానవ శరీరం మహా పవిత్రమైనది. ఈ యదార్థము మనం గ్రహించినట్లయితే నేటి మానవ్ఞడి జీవిత దృక్పథం, ఆలోచన, జీవిత విలువలు, జీవిత విధానం, ప్రవర్తన అన్నీ పూర్తిగా మారిపోతాయి. అంతరంగంలో విప్లవం వస్తుంది. పరివర్తన వస్తుంది. అప్పుడు ఆరోగ్యమే మహాభాగ్యం. శరీరం బ్రహ్మమందిరం. శరీర మాద్యం భిలు ధర్మసాధనం. మొదలైన సుభాషితాలు సార్థకమౌతాయి. అంతేకాదు, భగవదారాధనకు ఏ మసీదుకు, ఏ చర్చికి, ఏ గుడికి వెళ్లనవసరం లేదు. మానవ శరీరం ఒక దేవాలయంగా, శరీరంలోని ఆత్మే భగవంతునిగా భావించినట్లయితే దేహం విలువ, ఆరోగ్యం విలువ తెలుస్తుంది. అప్పుడు భగవంతుడు ప్రసాదించిన దేహం జాగ్రత్తగా భగవంతునికి అప్పచెప్పడం జరుగుతుంది. భగవంతుడు ప్రసాదించిన ఈ దేహానికి మనం కేవలం ధర్మకర్తలం మాత్రమే. ఈ దేహాన్ని ఏవిధంగాను దుర్వినియోగం చేయకూడదు. ఇదే నిజమైన ఆధ్యాత్మిక సాధన ధర్మంకూడ. ఈ శరీరమును బ్రతికినంత కాలం పరోపకారానికి మాత్రమే ఉపయోగించాలి. ఈ భావనతో అతి పవిత్రమైన జీవితం గడిపినట్లయితే ఏ దురభ్యాసాలు, దురలవాట్లు, దుర్వ్యసనాలు ఉండవు. ఆత్మహత్యలు ఉండవు. అందుకోసమే ఆత్మహత్య మహాపాపం అని అంటారు. శరీరం ఒక దేవాలయం. అందులోని గర్భాలయంలో ఆత్మ నిత్యనూతనంగా, స్వప్రకాశంతో వెలుగుతుంది.
కాని ఈనాడు యువకులు మానవ శరీరం విలువ గ్రహించకుండా అనేక వ్యసనాలకు లోబడి, విశృంఖలమైన జీవితం గడుపుతున్నారు. అటువంటి వారిని భగవంతుడు ఏ మాత్రం క్షమించడు. చేతులార వారి గొయ్యి వారు త్రవ్వు కొన్నట్లవుతుంది. భగవంతునికి ద్రోహం చేసినట్లవుతుంది. భగవంతుడు సర్వవ్యాపి. సర్వాంతర్యామి. సర్వగతుడు. సర్వజీవరాసులలో ఉన్నాడు. చరాచర సృష్టిలో ప్రకాశిస్తున్నాడు. మానవసేవయే మాధవ సేవగా భావించాలి. దేహమును పవిత్ర దేవాలయంగా భావించితే చాలు. బలహీనులకు, ఆత్మసాక్షాత్కారం కలుగునని ఉపనిషద్వాణి. శరీర పోషణ చాలా శ్రద్ధ తీసుకోవాలి. శరీరం అందంగా, దృఢంగా ఆరోగ్యంగా ఉండాలి. అందుకోసం శరీరమునకు ఒక నియమబద్ధమైన శిక్షణ అవసరం. అందుకోసం ఆహార నియమాలు కూడా పాటించాలి. మనం తినే ఆహారం బట్టి మన గుణాలు ఏర్పడతాయి.

గుణాలను బట్టి మన ప్రవర్తన ఆలోచన ఉంటుంది. మనం సాత్వికాహారం మితంగా తీసుకోవాలి. అతిగా తినకూడదు. ఉపవాసాలతో దేహాన్ని శుష్కించనీయకూడదు. ప్రతిరోజు నియమంగా ఒకవేళకు భుజించాలి. అంతేకాదు ప్రతి వ్యక్తి తన వయస్సును బట్టి వ్యాయామం చేయాలి. నడక అతి ముఖ్యమైనది. ఉదయం, సాయంత్రం నడక ఎంతో మేలు చేస్తుంది. భగవత్కార్యం చేయడం కోసమే ఈ దేహం భగవంతుడు మనకు ప్రసాదించాడు.

ఈ పరంగా ఆలోచించినట్లయితే ప్రతివ్యక్తి తన శరీరం లాంటిదే ఇతరుల శరీరం అని, తన ప్రాణం లాంటిదే ఇతరుల ప్రాణం అని, తన మనస్సు లాంటిదే ఇతరుల మనస్సు అని తనలోని ఆత్మయే ఇతరులలో ఉంటుందని గ్రహించాలి. అప్పుడు హింసలు, హత్యలు జరగవు. సమాజమే భగవంతుని ప్రత్యక్ష స్వరూపం. విరాట్‌స్వరూపం. ఆధ్యాత్మిక సాధనకు ప్రాతిపదిక మానవత్వం. కరుణ, మానవత్వపు శిఖరాగ్రమే దివ్యజీవనం.

– ఉలాపు బాలకేశవులు