దేశానికే ఆదర్శం కావాలి

apcm babu FFFF

ఆంధ్రప్రదేశ్ గ్రామాలు దేశానికే ఆదర్శం కావాలి
ఆంధ్రప్రదేశ్ గ్రామాలు దేశానికే ఆదర్శం కావాలి
‘‘నీరు-ప్రగతి’’ ఈవారం పురోగతిపై టెలికాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ గ్రామాలు దేశానికే ఆదర్శం కావాలి, అందరికీ నమూనాగా నిలవాలని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. సోమవారం తన నివాసం నుంచి ‘నీరు-ప్రగతి’ ఈవారం పురోగతిపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాల కలెక్టర్లు,ప్రజా ప్రతినిధులు,వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
నీరు,విద్యుత్,సిమెంట్ రోడ్లు,పారిశుద్ద్యం,పచ్చదనం,ప్రభుత్వ భవనాలు,ఆటస్థలాలు,పంటకుంటలు,చెక్ డ్యాములతో ప్రతి గ్రామం స్వయంపోషకం కావాలని ముఖ్యమంత్రి అన్నారు. 7 స్టార్స్ రేటింగ్ తో ప్రతి గ్రామం పట్టణాలకు ధీటుగా అన్నివసతులతో రూపొందాలన్నారు.
అటు మౌలిక సదుపాయాల కల్పన, ఇటు కుటుంబాల ఆదాయ పెంపు లక్ష్యంగా పనిచేయాలని కోరారు. గ్రామాభివృద్ది,కుటుంబాల ఆనందం,ఆరోగ్యజీవనం మన లక్ష్యాలు కావాలన్నారు. గ్రామాలలో మౌలిక సదుపాయాలతో పాటు ప్రతి కుటుంబం నెలకు కనీస రాబడి రూ.10వేలకు చేరుకునేలా అధికార యంత్రాంగం తగిన తోడ్పాటు అందించాలన్నారు.
సీజన్ మిస్ అయితే సంవత్సరం మిస్ అయినట్లే:
సీజన్ మిస్ అయితే సంవత్సరం మిస్ అయినట్లేనని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అటు కాలాన్ని,ఇటు నిధులను సద్వినియోగం చేసుకున్నప్పుడే ,అనుకున్న ఫలితాలు సాధించగలమని, టార్గెట్లు పూర్తిచేయగలమని చెప్పారు. అనంతపురం జిల్లాలో వర్షపాతంలోటు అధికంగా ఉందంటూ, ప్రత్యామ్నాయ పంటల సాగువైపు రైతులను ప్రోత్సహించాలన్నారు. ఆగస్టు 15లోపు వేరుశనగ నాట్లు పూర్తిచేసేలా చూడాలన్నారు.
ఇన్ పుట్ సబ్సిడి ఇప్పటికే 76% రైతుల ఖాతాల్లో పడిందని, మిగిలింది కూడా త్వరగా జమచేయాలని ఆదేశించారు. పెట్టుబడులకు రైతులు ఇబ్బంది పడకుండా చూడాలన్నారు.ఈ క్రాపింగ్ 72% పూర్తి చేశారంటూ,100% పూర్తిచేయాలన్నారు. మైక్రో న్యూట్రియంట్స్ పంపిణీ 42% మాత్రమే జరిగిందని, మిగిలినవి కూడా వెంటనే పంపిణీ చేయాలని ఆదేశించారు. పంటరుణాల పంపిణీ లక్ష్యంలో 46% మాత్రమే చేరుకోవడంపై అసంతృప్తి ప్రకటించారు. కౌలు రైతులకు రుణ పంపిణీ ముమ్మరం చేయాలన్నారు. 26వతేదీన వ్యవసాయ రుణాల పంపిణీపై సమీక్షిస్తానంటూ, ఆలోపునే లక్ష్యాలను చేరుకోవాలని ఆదేశించారు.
14.61 కోట్ల పనిదినాలతో దేశంలోనే ప్రథమ స్థానంలో ఆంధ్రప్రదేశ్:
నరేగా కింద 14.61 కోట్ల పనిదినాలతో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉండటం గొప్పవిషయం అంటూ 11.44 కోట్ల పనిదినాలతో రాజస్థాన్ రెండవ స్థానం, 10.76కోట్ల పనిదినాలతో తమిళనాడు తరువాత స్థానంలో ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావించారు. పంటసంజీవని టార్గెట్ 4లక్షలు కాగా ఇప్పటివరకు 75,500 పంటకుంటల తవ్వకం పూర్తయ్యిందని, గ్రవుండ్ అయిన 2,11,350 పంటకుంటలు వెంటనే పూర్తిచేయాలని కోరారు. కర్నూలు,విజయనగరం,విశాఖపట్నం,శ్రీకాకుళం,గుంటూరు జిల్లాలలో పంటకుంటల తవ్వకం మరింత ఊపందుకోవాలన్నారు. పంటకుంటల తవ్వకంలో దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్,జార్ఖండ్,పశ్చిమ బెంగాల్ మొదటి మూడు స్థానాల్లో ఉన్నట్లు తెలిపారు. నీరు-ప్రగతి ఉద్యమం కింద 90రోజుల్లో 6.95కోట్ల క్యూ.మీ.మట్టిని తొలగింపు పనులు జరిగాయన్నారు. సిసిరోడ్ల నిర్మాణ లక్ష్యం 6వేల కి.మీ కాగా 7,562 కి.మీ. గ్రవుండ్ చేయడాన్ని అభినందించారు.అంగన్ వాడి భవనాలు 772 నిర్మించారని,మిగిలిన 4,260భవనాల నిర్మాణం కూడా వేగవంతం చేయాలని అన్నారు. వర్మికంపోస్ట్ పిట్ల తవ్వకం 75,946పూర్తయ్యాయని, మిగిలిన లక్షా 25వేలు కూడా వేగంగా చేయాలని కోరారు.
కూరగాయల ఉత్పత్తి పెంపు, సక్రమ సరఫరాపై శ్రద్ధ పెట్టాలి:
చిత్తూరు జిల్లాలో ఇజ్రాయెల్ సేద్యం తొలిసారిగా ప్రారంభించిన గ్రామాన్ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. రూ.25కోట్ల విలువైన కూరగాయలను 500ఎకరాల్లో పండిస్తున్నారని, టిటిడి ఇక్కడినుంచే రూ.4కోట్ల విలువైన కూరగాయలు కొంటోందని గుర్తుచేశారు. రైతులను క్షేత్రస్థాయి పర్యటనలకు ఈ గ్రామాలకు తీసుకెళ్లాలని సూచించారు. కూరగాయల సేద్యం, పండ్లతోటల సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహించాలన్నారు. బహిరంగ మార్కెట్ లో కూరగాయల ధరల నియంత్రణపై దృష్టిపెట్టాలని ఆదేశించారు. కూరగాయల ఉత్పత్తి పెంపు, సక్రమ సరఫరాపై శ్రద్ధ పెట్టాలన్నారు. పండ్ల తోటల పెంపకంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు. ప్రతి నియోజకవర్గంలో రైతుబజార్లు ఏర్పాటుచేయాలని, ఉన్నవాటిని పటిష్టంచేయాలని అన్నారు.