దేశవాళీ క్రికెట్‌లో ఆడనివ్వండి

SMITH , WARNER
SMITH , WARNER

దేశవాళీ క్రికెట్‌లో ఆడనివ్వండి

సిడ్నీ: బాల్‌ టాంపరింగ్‌కు పాల్పడి ఏడాది పాటు నిషేధానికి గురైన ఆస్ట్రేలియా క్రికెటర్లు స్టీవ్‌ స్మిత్‌,డేవిడ్‌ వార్నర్‌లు తమకు విధించిన నిషేధంపై సడలింపు ఇవ్వాలని క్రికెట్‌ ఆస్ట్రేలియా (సిఏ)కోరుతున్నారు. ఇందులో భాగంగా దేశవాళీ క్రికెట్‌లో తమను ఆడేందుకు అవకాశం ఇవ్వాలని సిఏను కోరారు. కేప్‌టౌన్‌ వేదికగా ఆతిథ్య దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో స్మిత్‌, వార్నర్‌, బాన్‌క్రాఫ్ట్‌లు బాల్‌ టాంపరింగ్‌కు పాల్పడిన సంగతి తెలిసిందే. దీంతో క్రికెట్‌ ఆస్ట్రేలియా కూడా వీరిపై కఠినంగా చర్య తీసుకుంది. స్మిత్‌, వార్నర్‌పై ఏడాది పాటు నిషేధం విధించగా…బాన్‌క్రాఫ్ట్‌పై 9నెలల పాటు నిషేధం విధించింది. దీంతో పాటు వంద గంటల పాటు స్వచ్ఛంద సేవచేయాలని సూచించింది. ఈ వివాదానికి సూత్రదారి అయిన డేవిడ్‌ వార్నర్‌ ఎప్పటికీ ఆస్ట్రేలియా జట్టుకు కెప్టెన్‌ కాలేడని సిఏ స్పష్టం చేసింది. అయితే, కెప్టెన్సీ విషయంలో స్మిత్‌, బాన్‌క్రాఫ్ట్‌ ఒకింత ఊరటనిచ్చింది.

కెప్టెన్సీని చేపట్టకుండా స్మిత్‌పై రెండేళ్ల నిషేధం విధించింది. అయితే, ఈ రెండేళ్ల కాలంలో దేశీయ, అంతర్జాతీయ మ్యాచుల్లో వీరు కెప్టెన్సీ చేపట్టరాదని పేర్కొంది. అయితే, ఆ తర్వాత క్రికెట్‌ అభిమానుల నుంచి, అధికారుల నుంచి అనుమతి, ఆమోదం ఉంటే జట్టు కెప్టెన్సీ పగ్గాలు చేపట్టవచ్చునని పేర్కొంది. క్రికెట్‌ ఆస్ట్రేలియా తీసుకున్న నిర్ణయంతో వీరిద్దరిని ఐపిఎల్‌ ఆడకుండా బిసిసిఐ కూడా నిర్ణయం తీసుకుంది. ఇక, ఇంగ్లీష్‌ కౌంటీ క్లబ్‌ సోమర్సెట్‌ బాన్‌క్రాప్ట్‌తో ఉన్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. బాల్‌ టాంపరింగ్‌ ఘటనలో క్రికెట్‌ ఆస్ట్రేలియా విధించిన శిక్ష తీవ్రత కూడా చాలా ఎక్కువగా ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో వాళ్లు పాల్పడిన నేరానికి ఈ శిక్ష చాలా ఎక్కువని, అందువల్ల దానికి కాస్త సడలించాల్సిందిగా ఈ ముగ్గురి తరపు అడ్వైజర్లు సిఏను కోరనున్నారు. ఈ ముగ్గురు దేశవాళీ క్రికెట్‌లోనూ ఆడకపోతే….నిషేధం ముగిసిన తర్వాత ఆస్ట్రేలియా జట్టులో వచ్చే అవకాశాలు పూర్తిగా తగ్గిపోతాయని వారు వాదిస్తున్నారు. అయితే క్రికెట్‌ ఆస్ట్రేలియా తమ ఆటగాళ్లపై నిషేధం విధించినా…అది ఆస్ట్రేలియా బయిట ఆడటాన్ని కూడా నిషేధిస్తుందా లేదా అన్న దానిపై మాత్రం స్పష్టత లేదు.