దుబాయ్‌లో ధోనీ క్రికెట్ అకాడ‌మీ ప్రారంభం

dhoni cricket  academy in dubai
dhoni cricket academy in dubai

దుబాయ్ః యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లోని దుబాయ్‌లో ధోనీ గ్లోబల్‌ క్రికెట్‌ అకాడమీ ప్రారంభమైంది. భారత్‌కు రెండు ప్రపంచకప్‌లు అందించిన మహేంద్ర సింగ్‌ ధోనీ ఈ అకాడమీని శనివారం లాంఛనంగా ప్రారంభించాడు. దుబాయ్‌కి చెందిన పసిఫిక్‌ స్పోర్ట్స్‌, భారత్‌కు చెందిన అర్కా స్పోర్ట్స్‌ క్లబ్‌లు సంయు క్తంగా ఈ అకాడమీని ఏర్పాటు చేశాయి. స్థానిక స్ర్పింగ్‌డేల్‌ స్కూల్‌ లో ఈ అకాడమీ ఏర్పాటు చేసేందుకు రెండు నెలలుగా తీవ్రంగా శ్రమించారు. ఈ కోచింగ్‌ కేంద్రానికి ఎంఎస్‌ ధోనీ క్రికెట్‌ అకాడమీ అని పేరుపెట్టి అతనితోనే ప్రారంభింపచేశారు. ఈ శిక్షణ కేంద్రంలో నాలుగు టర్ఫ్‌ పిచ్‌లు, మూడు సిమెంట్‌, మూడు మ్యాట్‌తో కూడిన పిచ్‌లు, స్పిన్‌, పేస్‌ బౌలింగ్‌ యంత్రాలు, రక్షాత్మక వలలు, రాత్రిపూట సాధనకు విద్యుత్‌ దీపాల సౌకర్యం, క్రికెట్‌ సామగ్రిని విక్రయించే దుకాణం, వీడియో విశ్లేషణ సాధనాలు అందుబాటులో ఉంచారు. శిక్షణలో తల్లిదండ్రులను కూడా భాగస్వాములను చేయనుండడం ఈ కేంద్రం ప్రత్యేకత. ముంబైకి చెందిన మాజీ బౌలర్‌ విశాల్‌ మహదిక్‌ కోచింగ్‌ బాధ్యతలు నిర్వర్తించ నున్నారు. అకాడమీ ప్రారంభం సందర్భంగా మహీ మాట్లాడుతూ ఈ అకాడమీతో భాగస్వామ్యం అయినందుకు సంతోషంగా ఉందని, క్రికెట్‌ ఉన్నతికి తనవంతు సహాయం చేస్తున్నందుకు ఆనందంగా ఉందని అన్నాడు. యువ క్రికెటర్ల ఆసక్తే ఈ కేంద్రాన్ని నడిపిస్తుందన్న ఆశాభావం వ్యక్తంచేశాడు.