దిగివస్తున్న రేషన్‌ డీలర్లు

RATION
RATION

ప్రభుత్వ హెచ్చరికలతో
దిగివస్తున్న రేషన్‌ డీలర్లు

ఇప్పటికే 12 వేలకు చేరుకున్న డీడీలు
సరకులు పంపిణీ చేస్తూనే పోరు సల్పాలని నిర్ణయం
డీడీలకు గడువు పెంచాలని వినతి

హైదరాబాద్‌: రేషన్‌ డీలర్ల సమ్మెను తీవ్రంగా పరిగణించిన రాష్ట్ర ప్రభుత్వం సమ్మె చేస్తే వేటు తప్పదని హెచ్చరించడంతో సమ్మె బాట పట్టిన రేషన్‌ డీలర్లు వెనక్కు తగ్గారు. సరుకులు పంపిణీ చేస్తూనే తమ న్యాయమైన సమస్యల పరిష్కారానికి పోరాటం చేయాలని తాజాగా నిర్ణయించారు. సమస్యల పరిష్కారం కోరుతూ డిసెంబర్‌ 1న నుండి సమ్మెలోకి వెళుతున్నట్లు రేషన్‌ డీలర్ల సంఘాలు ఇదివరకు ప్రకటించిన విషయం తెలిసిందే.

డిసెంబర్‌ నెల సరుకుల కోటా తీసు కోడానికి గాను నవంబర్‌ చివరి నాటికి డీడీలు కట్టాల్సిన డీలర్లు దాదాపు సగం మంది డీడీలు కట్టక పోవడం, డీడీలు కట్టిన డీలర్లు కూడా సరుకులు పంపిణీ చేయకూడదని నిర్ణయించిన దరిమిలా రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌ అయ్యింది. సమ్మె చేసే డీలర్లను తొలగించి కొత్తవారిని నియమించాలని ముఖ్య మంత్రి కెసిఆర్‌ పౌరసరఫరాల అధికారులకు ఆదేెశించడం, ఆ మేరకు అధికారులు డీలర్లకు హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. కాగా నవంబర్‌ నెలాఖరు నాటికి కేవలం 7 వేల మంది డీలర్లు మాత్రమే డీడీలు కట్టగా నాయికోటి రాజు నేతృత్వంలోని డీలర్ల సంఘం చివరి నిముషంలో తాము సమ్మె చేయడం లేదని ప్రకటించింది. కాగా డీడీలు కట్టని డీలర్లకు ప్రభుత్వం డిసెంబర్‌ 2వ తేదీ వరకు గడువు ఇచ్చింది.

ఆగడువు శనివారంతో ముగిసింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా శనివారం నాటికి దాదాపు 12 వేల మంది డీలర్లు డీడీలు కట్టినట్లు అధికారవర్గాలు తెలిపాయి. శని, ఆదివారాలు సెలువు కావడం, మీసేవా కార్యాలయాల్లో సాంకేతిక సమస్యల కారణంగా డీలర్లు పూర్తి స్థాయిలో డీడీలు కట్టలేదని తెలిసింది. అయితే సమ్మె యోచనను డీలర్ల సంఘాలు అనధికారికంగానే ఉపసంహరించుకు న్నాయి.

డీడీలకు గడువు పెంచే అవాకాశాలు ఉన్నట్లు తెలిసింది. దీంతో డీలర్లు అందరూ డీడీలు కట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు రేషన్‌ డీలర్లు సమ్మెను ఉపసంహరించుకుంటారన్న ఆశాభావాన్ని పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ సివి ఆనంద్‌ వ్యక్తం చేశారు. సమ్మెను విరమించి చర్చలకు రావాలని ఆయన డీలర్లకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం సమస్యల పరిష్కారానికి సిద్దంగా ఉందని అన్నారు. డిసెంబర్‌ నెలకు సంబంధించిన డీడీలు కట్టేందుకు ఈ నెల 4వరకు గడువు పెం చాలని రేషన్‌ డీలర్ల సంఘం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.