దిండి,పాలమూరు,కాళేశ్వరం పునరావాస చర్యలు

T. Harish rao
T. Harish rao

హైదరాబాద్‌:దిండి,పాలమూరు,కాళేశ్వరం ప్రాజెక్టులకు సంబంధించి సహాయ, పునరావాస చర్యలు వేగవంతం చేయాలని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు ఆయా జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. బుధవారంనాడు సచివాల యంలో సిద్దిపేట, సూర్యపేట, రాజన్న సిరిసిల్ల,మహబూబ్‌నగర్‌,నాగర్‌కర్నూల్‌ జిల్లా కలెక్టర్లతో మంత్రి వీడియో కాన్పరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శైలేంద్రకుమార్‌ జోషి, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్‌, కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్సీ హరిరామ్‌,ఇరిగేషన్‌ ఓఎస్డీ శ్రీథర్‌ దేశ్‌ పాండే పాల్గొన్నారు. దిండి,పాలమూరు, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ పనులు వేగవంతం చేయాలని మంత్రి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. దీంతో పాటు మెగురైన పునరావాస ప్యాకేజీని అందించాలని సూచించారు. 2013 ఆర్‌ ఆండ్‌ ఆర్‌ యాక్ట్‌ కన్నా మిన్నగా ప్రాజె క్టులో ఇళ్లు, ఆస్తులు కోల్పోయిన వారికి పునరావాస ప్యాకేజీ ఉండాలన్నారు. మల్లన్న సాగర్‌,కొండ పోచమ్మ, అనంతగిరి, రంగనాయకసాగర్‌,మేడారం రిజర్వాయర్ల పరిధిలో భూసేకరణ పనులు పూర్తి చేయాలని, వీటి కింద ఇళ్లు కోల్పోయిన వారికి మెరుగైన సహాయ పునరావాస కారక్రమాలు వెంటనే చేపట్టాలని ఆదేశించారు. పరిహారం నిమిత్తం ఇప్పటికే విడుదల చేసిన నిధులను భూములు,ఇళ్లు,ఆస్తులు కోల్పోయిన వారికి వెంటనే చెల్లించాలన్నారు.
కల్వకుర్తి ప్రాజెక్టు ద్వారా కొత్తగా లక్ష ఎకరాలకు నీరు
కల్వకుర్తి ప్రాజెక్టు ద్వారా గత ఏడాది రెండున్నర లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చామని, ఈ ఏడాది కొత్తగా మరో లక్ష ఎకరాల ఆయకట్టుకునీరు ఇస్తామని మంత్రి హరీష్‌రావు చెప్పారు. ఈ ఏడాది 3లక్షల 60వేల ఎకరాలకు నీరిచ్చేలా తగిన ప్రణాళికలు సిద్దం చేయాలని నాగర్‌కర్నూల్‌ జిల్లా కలెక్టర్‌ను మంత్రి ఆదేశించారు. కల్వకుర్తి పరిధిలో భూసేకరణ పనులు పూర్తి చేయాలన్నారు. ఇందుకు అవసరమైన 13 కోట్ల రూపాయలను రెండు,మూడు రోజుల్లో విడుదల చేయనున్నట్లు మంత్రి చెప్పారు. మూసీ ప్రాజెక్టు కింద సైతం ఈ ఏడాది కొత్తగా 26వేల ఎకరాలకు సాగునీరు ఇస్తున్నామని అందుకు సంబంధించిన ప్రణాళికలు సిద్దం చేయాలన్నారు. ఈనెల 15వ తేదీలోగా ఆయకట్టుకు నీటిని విడుదల చేసేలా చూడాలని నల్లగొండ జిల్లా కలెక్టర్‌ను మంత్రి ఆదేశించారు.