దగా అంటే అల్లాకు నచ్చదు

prayer1
prayer

దగా అంటే అల్లాకు నచ్చదు

నేటి సమాజం అసంఖ్యాక సమస్యలకు, చెడులకు, దురలవాట్లకు ఆలవాలమైంది. దగా, మోసం, ద్రోహం సర్వసాధారణమైంది. కొందరైతే తమ మాటలతో, తమ వాగ్ధాటితో సత్యాన్ని అసత్యంగా, నిర్దోషిని నేరస్తునిగా చూపటం జరుగుతూ ఉంది. అందుకే దివ్యఖుర్‌ఆన్‌లో ”ఆత్మద్రోహం చేసుకునేవారి పక్షాన నిలిచి వాదించకు. దగాకోరును, పాపిష్టివాడిని అల్లాహ్‌ సుతరామూ ఇష్టపడడు(4ః107) ఈ పవిత్ర వాక్యంలో మనకు తెలిసేదేమంటే ఇతరులను దగాచేసే వారిని అల్లాహ్‌ తిరస్కరిస్తాడు. ఎవరి వస్తువైనా తన వద్ద దాస్తే అందులో కొంతకాజేసేవారు ఇతరులను దగా చేసినవారవ్ఞతారు. ఉదాహరణకు ఎవరైనా ఒక వ్యక్తికి పది కిలోల చక్కెర దాచి ఉంచమని ఇస్తే, అందులో ఆ వ్యక్తికి తెలియకుండా ఒక కిలో చక్కెర కాజేసి నాకేమీ తెలియదని చెప్పేవాడు.

ప్రవక్త(స)గారి కాలంలోని ఒక సంఘటనను గమనిస్తే ద్రోహులు, దగాకోరుల గురించి తెలుస్తుంది. అన్సార్‌ వర్గానికి చెందిన బనీ జఫర్‌ తెగలో తోమా అనే వ్యక్తి ఉండేవాడు. (అన్సార్‌ అంటే దైవప్రవక్త(స)ను, ఇస్లాంకోసం అక్కడికి వలస వచ్చిన వారిని ఆదుకున్న మదీనావాసులు అతడు మరో అన్సార్‌ వ్యక్తికి చెందిన యుద్ధ కవచాన్ని (ఇనుపజాకెట్‌) దొంగిలించాడు. ఈ విషయం కొంతమందికి తెలిసింది. దానిపై గుసగుసలు మొదలయ్యాయి. దాంతో ఆ వ్యక్తి ఆందోళన చెంది, తన దొంగతనాన్ని కప్పిపుచ్చే ప్రయత్నంలో ఆ కవచాన్ని ఒక యూదుని ప్రాంగణంలో పారేశాడు.

అంతేకాదు బనీజఫర్‌కు చెందిన కొంతమందిని వెంటబెట్టుకొని దైవప్రవక్త (స) సన్నిధికి వచ్చాడు. దొంగతనానికి ఒడిగట్టిందని ఫలానా యూదుడేనని వారంతా వాదించారు. ఆ యూదుడు కూడా దైవప్రవక్త(స) దగ్గరికి వచ్చి, తానే పాపం ఎరుగననీ, వాళ్లే దొంగతనం చేసి తన ఇంట్లో ఆ కవచాన్ని పారవేశాడని సంజాయిషీ ఇచ్చుకున్నాడు. బనీజఫర్‌ బృందం వారు తెలివి మీరినవారు. తమ వాక్చాతుర్యంతో యూదవ్యక్తినే దోషిగా నిలబెట్టారు. దైవప్రవక్త(స) కూడా వారి వాక్పటిమకు ప్రభావితులై, అన్సార్‌ వ్యక్తిని నిర్దోషిగా ఖరారు చేసి యూదుణ్ణి నేరుస్థునిగా ప్రకటించాలనుకున్నారు.

అంతలోనే ఈ ఆయతులు (పవిత్రవాక్యాలు) అవతరించాయి. దీనిద్వారా అర్థం అయ్యే విషయమేమంటే దైవప్రవక్త సహితం మానవసహజమైన బలహీనత వల్ల విషయాన్ని సరిగా అర్థం చేసుకోలేకపోవచ్చు. అదీగాక ఆయనకు అగోచర జ్ఞానం ఉండదని కూడా దీని ద్వారా బోధపడుతున్నది. అగోచరజ్ఞానమే గనుక ఉండి ఉంటే తక్షణం ఆయనకు నిజస్వరూపం అర్థం అయ్యేది. కానీ అలా జరగలేదు. అయితే అల్లాహ్‌ తన ప్రవక్తల ద్వారా తప్పు జరుగకుండా, అన్యాయం జరగకుండా సత్వరమే వారిని కాపాడుతాడు. ఇక్కడ ద్రోహానికి పాల్పడినవారు బనీజఫర్‌ తెగవారే. తాము ఖుద్దుగా దొంగతనం చేసింది గాక, తమ వాగ్దాటితో దబాయింపులతో యూద వ్యక్తిని నిందితునిగా నిలబెట్టే యత్నం చేశారు. ఆ తరువాత వచ్చే వాక్యాలలో గూడా వీరిని సమర్థించిన వారి దుర్నీతి గురించి దేవ్ఞడు తన ప్రవక్త(స)కు తెలియపరచాడు.

వర్గ, ప్రాంతీయ దురభిమానంతో తీర్పులు ఇచ్చే పెద్దలకు ఇది గుణపాఠం కావాలి. ”తప్పయినా, ఒప్పయినా నావాడు అనే ధోరణిని మానుకోమని ఇస్లాం అంటోంది. ఇరువ్ఞరు వ్యక్తులు తమ తగాదా గురించి నివేదించుకొన్నపుడు ఎవరు సత్యం వైపు ఉన్నారో తెలుసుకోకుండా గుడ్డిగా ఒకరి పక్షాన నిలిచి వాదించటం సమ్మతం కాదు. ”ఒక విశ్వాసి ఎప్పుడూ దగా చెయ్యడు అని మహాప్రవక్త(స) చెప్పారు.

– షేఖ్‌ అబ్దుల్‌ హఖ్‌