త‌లాక్ బిల్లుపై ఆర్డినెన్స్‌

ravi shanker prasad
ravi shanker prasad

న్యూఢిల్లీః మూడుసార్లు తలాక్ చెప్పి భార్యకు విడాకులివ్వడం ఇకపై శిక్షార్హం కానున్నది. ఈ మేరకు కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌కు మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. ఇటీవలి వర్షాకాల సమావేశాల్లో.. ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణ బిల్లు-2017 పేరిట ప్రవేశపెట్టిన బిల్లు రాజ్యసభ ఆమోదం పొందలేకపోవడంతో చట్టంగా మారలేదు. ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను తీసుకువచ్చింది. దీనికి రాష్ట్రపతి వెంటనే ఆమోదముద్ర వేశారు. దీంతో ఆర్డినెన్స్‌కు చట్టబద్ధత లభించడంతోపాటు వెనువెంటనే అమల్లోకి వచ్చింది. ఈ ఆర్డినెన్స్ ప్రకారం మూడుసార్లు తలాక్ (తలాక్-ఏ-బిద్దత్) చెప్పి భార్యకు విడాకులివ్వడాన్ని నేరంగా పరిగణిస్తారు. అందుకు మూడేండ్ల జైలుశిక్షతోపాటు జరిమానా కూడా విధించవచ్చు. తక్షణ ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు తేల్చిచెప్పిన నేపథ్యంలో బిల్లు చట్టరూపం దాల్చేందుకు పార్లమెంట్‌లో తీవ్రంగా ప్రయత్నించామని, మరో మార్గంతరం లేకపోవడంతో ఈ ఆర్డినెన్స్ తీసుకురాక తప్పడం లేదని న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ప్రసాద్ తెలిపారు.