త‌మిళుల జీవితాల్లో వెలుగులు నింప‌డ‌మే ల‌క్ష్యంః ర‌జ‌నీ

Rajanikanth
Rajanikanth

చెన్నైః తమిళుల జీవితాల్లో వెలుగులు నింపడమే తన లక్ష్యమని, అందుకోసమే కొత్త పార్టీని పెడుతున్నానని అలా ప్రకటించారో లేదో, సూపర్ స్టార్ రజనీ వెంట నడిచేందుకు లక్షలాది మంది తమిళులు సిద్ధమైపోయారు. తన పార్టీ పేరును కూడా ఇంతవరకూ రజనీ చెప్పలేదుగానీ, సభ్యత్వ నమోదును మాత్రం ఆయన ప్రారంభిస్తున్నట్టు వెల్లడిస్తూ, ఓ వెబ్ సైట్ ను తెరువగా, 24 గంటల్లోనే 5 లక్షల మంది తమిళులు తమ ఓటర్ కార్డు నంబర్, ఆధార్ కార్డు నంబర్ ను జత చేసి మరీ ఆ పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు. సభ్యత్వంలో రజనీకాంత్ పార్టీ కొత్త రికార్డులను సృష్టించింది. ఇంకా చెప్పాలంటే రజనీ మేనియా ఇప్పుడు తమిళనాడును ఓ ఊపు ఊపేస్తోంది. ఇప్పటివరకూ ఓ రాజకీయ పార్టీని పెట్టిన 24 గంటల వ్యవధిలో ఇంత మంది ఫాలోవర్లుగా మారిన సందర్భం దేశ చరిత్రలోనే లేదంటున్నారు. ఇక రజనీ విడుదల చేసిన మొబైల్ యాప్ కు సైతం విపరీతమైన ఆదరణ లభిస్తోంది. ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్న వారి సంఖ్య వేలు దాటి లక్షల్లోకి చేరినట్టు సమాచారం. ఇక జరుగుతున్న రాజకీయ పరిణామాలను అన్నాడీఎంకే, డీఎంకే పెద్దలు నిశితంగా పరిశీలించడం మినహా, ప్రస్తుతానికి మరేమీ చేయలేని పరిస్థితి.