త్వ‌ర‌లో వాస్త‌వాలు వెలుగులోకి

Paripurnanda swamy
Paripurnanda swamy

తూర్పు గోదావరి : కాకినాడ శ్రీ పీఠంలో పరిపూర్ణానంద స్వామీజీని శనివారం హిందూ ధార్మిక సంస్థల నేతలు కలిశారు. ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి, విహెచ్‌పి, గోరక్షక దళం, ఎబివిపి, ఆర్‌ హెచ్‌ఎస్‌ హిందు ధార్మిక సంస్థల నేతలు సహా ఉప్పల్‌ ఎమ్మెల్యే ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌లు కలిశారు. అనంతరం బిజెపి ఎమ్మెల్యే ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌ మాట్లాడుతూ.. గంటపాటు విశ్వహిందూ సమాజం తరుపున స్వామీజీని హైదరాబాద్‌కు రమ్మని సాదరంగా ఆహ్వానించామన్నారు. అందుకు స్వామీజీ సానుకూలంగా స్పందించారని తెలిపారు. హైదరాబాద్‌లో స్వామీజీపై ఉన్న బహిష్కరణపై కోర్టు స్టే ఇచ్చిందని, స్వామీజీకి తెలంగాణా ప్రభుత్వం స్వాగతం పలుకుతోందని భావిస్తున్నామని పేర్కొన్నారు. అనంతరం స్వామీ పరిపూర్ణానంద మాట్లాడుతూ.. బహిష్కరణ వ్యవహారం మంచిదా చెడ్డదా అనేది తెలంగాణ ప్రజలు చెబుతారన్నారు. తెలంగాణాలో తాను విస్తృతంగా పర్యటిస్తానని, సెప్టెంబర్‌ 4న తాను తప్పకుండా హైద‌రాబాద్‌కు వెళతానని స్పష్టం చేశారు. 250 మందిని చంపిన క‌స‌బ్‌ను ఇండియాలోనే ఉంచారు కాని నన్ను మాత్రం తెలంగాణ నుండి బహిష్కరించారని విమర్శించారు. బహిష్కరణకు సంబంధించిన వాస్త‌వాలు త్వ‌ర‌లో వెలుగులోకి వ‌స్తాయ‌న అన్నారు..