త్వరలో విద్యుత్‌ వాహన విధానం

MODI
MODI

మూవ్‌ సదస్సులో ప్రధానిమోడీ
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం సత్వరమే విద్యుత్‌ వాహన విధానాన్నిప్రకటిస్తుందని ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించారు. విద్యుత్‌ వాహనాలను పెద్ద ఎత్తునప్రోత్సహించేందుకు వీలుగా ఈ వాహనాలకు ఒక ప్రత్యేక విధానం ఏర్పాటుచేస్తామని వెల్లడించారు. ప్రపంచ స్థాయి ఆటోమొబైల్‌ సదస్సు మూవ్‌లో ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ టెక్నాలజీ కంపెనీలు, ఆటోమొబైల్‌ కంపెనీలకు విద్యుత్‌ వాహణ ఉత్పత్తిని ప్రోత్సహిస్తామని హామీ ఇచ్చారు. నీతిఆయోగ్‌ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ సదస్సులో మోడీ మాట్లాడుతూ దేశంలో విద్యుత్‌ వాహన వినియోగంప్రోత్సహించేందుకు ఎంతమేర ప్రభుత్వ మద్దతు అవసరమో అంతకుమించి ప్రోత్సాహం అందిస్తామని, సత్వరమే విద్యుత్‌ వాహన విధానాన్ని సైతం ప్రకటిస్తామని వెల్లడించారు. విద్యుత్‌ వాహణ వినియోగంతో పెద్ద ఎత్తున ఆర్ధికవృద్ధి ఉంటుందని, జీవన శైలి మెరుగుపడుతుందని అన్నారు. బ్యాటరీలనుంచి స్మార్ట్‌ ఛార్జింగ్‌ కేంద్రాలు, విద్యుత్‌ వాహన ఉత్పత్తికిసైతం ప్రోత్సాహం ఉంటుందని అన్నారు. ఇందుకోసం ఒక స్థిరమైన విద్యుత్‌ వాహన విధానం, ప్రత్యామ్నాయ ఇంధన వాహనాలకు అనువుగా కొత్త ప్రణాళిక అమలుచేస్తామన్నారు. ఆటోమొబైల్‌ రంగంలో మరింతగా విస్తృత అవకాశాలనుపెంచేందుకు తమ ప్రణాళిక మంచి మద్దతునిస్తుందని వెల్లడించారు. ఈరంగంలో విద్యుత్‌ వాహనాలను అందుబాటులోనికి తెచ్చేందుకు విస్తృత అవకాశాలున్నాయని, కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు విద్యుత్‌ వాహనాలు ఎంతో ఉపకరిస్తాయని ఆయన అన్నారు. కొత్త ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, ముడిచమురు వినియోగం భారీగా తగ్గించవచ్చని, ఫలితంగా చమురురంగంలో 80శాతం ముడిచమురు అవసరాలను మరింత తగ్గించుకోగలమని మోడీ పేర్కొన్నారు. అంతకుముందు నరేంద్రమోడీ విద్యుత్‌ వాహన ఉత్పత్తి దారుల ముఖ్యప్రతినిధులతో చర్చలుజరిపారు. బ్యాటరీల తయారీదారులు, టెక్నాలజీ నిపుణులతో విస్తృతస్థాయి చర్చలుజరిపారు. 2030 నాటికి భారత్‌లో కొత్త విద్యుత్‌ వాహనాలను ఉత్పత్తిచేస్తామని, ప్రభుత్వరంగంలోని ఇండియన్‌ ఆయిల్‌, విద్యుత్‌ ఉత్పత్తి సంస్థ ఎన్‌టిపిసిలు సైతం ఛార్జింగ్‌స్టేషన్లను ఏర్పాటుచేసేందుకు ముందుకువచ్చాయని అన్నారు. విద్యుత్‌వాహన ఉత్పత్తిరంగంలో ఇదొక మంచి పరిణామమని ఆయన అన్నారు. విద్యుత్‌ వాహణ రాకపోకలు ఎక్కువగా బ్యాటరీల ఎక్కువ వ్యయం చేయాల్సి వస్తోందని, పాలకులు కొత్త టెక్నాలజీ సాయంతో వీటిధరలను తగ్గించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచించారు. పరిశ్రమ నిపుణులతో మోడీ మాట్లాడుతూ హైవేలను రెట్టింపుసంఖ్యలో ఆధునీకరిస్తోందని, మరిన్ని పట్టణాలకు, వైమానిక రూట్లకు చేరువచేస్తోందని, దీనివల్ల ఇంధన ఆదాజరుగుతుందని అన్నారు. ఈ విద్యుత్‌ ఉత్పత్తి,వినియోగాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఒక నిర్దిష్టమైన ప్రణాళికగా సొంతంచేసుకోవాలని సూచించారు. మహీంద్ర గ్రూప్‌ ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్ర మాట్లాడుతూ మల్టీమోడల్‌ రవాణా విధానాలకు మొబైల్‌ అప్లికేషన్లు ఎంతో పరిజ్ఞానం అందిస్తాయని, దూరప్రాంతాలకు సైతం ప్రయాణించేవీలుగా ఈ అప్లికేషన్లు మొత్తం జీవన శైలినే మార్చేస్తాయని అన్నారు.