త్వరలో లక్ష అర్జీల పరిష్కారం

AP Minister Anand Babu
గిరిజన రైతుల సమావేశంలో మాట్లాడుతున్న రాష్ట్ర సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు

AP Minister Anand Babu

త్వరలో లక్ష అర్జీల పరిష్కారం

మంత్రి  ఆనందబాబు

అమరావతి” రాష్ట్రంలో అటవీహక్కుల చట్టం కింద అపరిష్కృతంగా ఉన్న లక్ష అర్జీలకు త్వరలో పరిష్కారం చూపనున్నామని రాష్ట్ర సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు గిరిజన రైతులకు హామీ ఇచ్చారు. ఈ నెలాఖరులోగా 20 వేల అర్జీలను పరిష్కరించి, భూమి హక్కు పత్రాలు ఇస్తామని, గిరిజనుల భూముల్లో బోర్లు వేయడంతోపాటు పెట్టుబడుల కోసం రుణాలు కూడా ఇవ్వనున్నట్లు మంత్రి చెప్పారు. సద్భావన, విజ్ఞాన యాత్ర ముగించుకుని సచివాలయ సందర్శనకు వచ్చిన సీతంపేట, పార్వతీపురం, పాడేరు, రంపచోడవరం ఐటిడిఏలకు చెందిన 80 మంది ఔత్సాహిక గిరిజన రైతులతో గురువారం మంత్రి తన కార్యాలయంలో సమావేశమయ్యారు. మన్యంలోని ప్రతి గిరిజన కుటుంబానికి నెలకు రూ.10 వేల ఆదాయం వచ్చేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిదన్నారు. దీనిలో భాగంగా గిరిజన రైతులు ఆర్థికాభివృద్ధి చెందడానికి ప్రభుత్వం సద్భావన, విజ్ఞాన యాత్ర నిర్వహించిందని మంత్రి వెల్లడించారు. ఈ యాత్రల ద్వారా గిరిజన రైతులు తమ పక్క ఐటిడిఏల్లో ప్రభుత్వ పథకాలతో వ్యవసాయం చేస్తూ ఆ ప్రాంత గిరిజనులు ఏ విధంగా లబ్దిపొందుతున్నారో అవగాహన కల్పించుకోవడం ఆనందకరమన్నారు. యాత్రలో గ్రహించిన అంశాలను అవలంభించి అధిక లాభాలు పొందాలని రైతులకు సూచించారు

మాజీ ముఖ్యమంత్రి ఎన్‌.టి.రామరావు కృషి వల్లే రాష్ట్రంలో గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి జరుగుతోందన్నారు. గిరిజనుల సంక్షేమానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిరంతరం కృషి చేస్తున్నారని మంత్రి చెప్పారు. అటవీహక్కుల చట్టం 2006 ద్వారా నేటి వరకూ రాష్ట్ర వ్యాప్తంగా 89,360 మంది గిరిజన రైతులకు 6,60,165 ఎకరాలకు సంబంధించి భూమి హక్కు పత్రాలు అందజేశామని చెప్పారు. 2015-2017 కాలంలో 7,791 మంది గిరిజన రైతులకు 69,441 ఎకరాలకు భూమి హక్కు పత్రాలు ఇచ్చామని తెలిపారు.

మరో లక్ష అర్జీలకు పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. ఈ అర్జీ పరిష్కారం కోసం ఇటీవల అటవీ, రెవెన్యూ శాఖలతో సమావేశం జరిపామని, ఏజన్సీలోని భూములకు సాగునీటి సదుపాయం కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ట్రైకార్‌, గిరిజన సంక్షేమ శాఖ ద్వారా బోర్లు వేయడానికి చర్యలు తీసుకుంటున్నామని, వ్యవసాయ పెట్టుబడుల కోసం ఎన్‌ఎస్‌టిఎఫ్‌డిసి ద్వారా రూ.లక్ష రుణం ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇందులో పావలా వడ్డీ కింద రుణంగా రూ.90 వేలు, మిగిలిన రూ.10 వేలు లబ్దిదారు భరించాల్సి ఉంటుందన్నారు. దశల వారీగా రుణాలు మంజూరు చేస్తామని చెప్పారు. అటవీహక్కు చట్టం రాకముందు గిరిజనులపై పెట్టిన కేసులను పరిష్కరించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని మంత్రి ఆనందబాబు తెలిపారు. గిరిజన సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి ఆర్‌.పి.సిసోడియా మాట్లాడుతూ భూమి హక్కు పొందిన గిరిజన రైతులు వాటిని వృథాగా ఉంచవద్దని, పంటలు సాగు చూస్తూ అభివృద్ధి చెందాలని కోరారు. హక్కు పొదిన వారు ఆ భూములను గిరిజనేతురులకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ట్రైకార్‌ ఎండీ రవీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.