త్వరలో పరిటాల శ్రీరామ్ వివాహం

Partial suneeta
Paritala suneeta

రామగిరి: ప్రతి గ్రామంలో బూత్ స్ధాయి నుండి పార్టీని బలోపేతం చేయాలని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమం, సెర్ప్ శాఖ మంత్రి శ్రీమతి పరిటాల సునీత పేర్కొన్నారు. రామగిరి మండల కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంత్రి నియోజకవర్గ నాయకులతో సమావేశమై బూత్ కమిటీల ఎంపికపై చర్చించారు. ఈ సందర్భంగా బూత్ కమిటీల ఎంపిక ఎలా ఉండాలి, అవి ఎలా పనిచేయాలనే అంశాలను మంత్రి నాయకులకు వివరించారు. రాప్తాడు నియోజకవర్గంలోని 270 బూత్ లకు కన్వీనర్ మరియు సభ్యులను ఎన్నుకోవాలని మంత్రి సూచించారు. కమిటీల ఎంపికలో అన్ని వర్గాల వారికి ప్రాధాన్యమిస్తూ పార్టీ కోసం పనిచేసేవారిని భాగస్వాములను చేయాలన్నారు. ఓటర్ల జాబితా ప్రకారం ప్రతి పోలింగ్ బూత్ నుండి ఒక కన్వీనర్ ను, ప్రతి 100 మంది ఓటర్లకు ఒక సభ్యుని ఎన్నుకోవాలని తెలిపారు. రెండు రోజుల్లోగా ఈ కమిటీల ఎంపిక పూర్తి చేసి వివరాలను ఆన్ లైన్ లో అప్ లోడ్ చేయాలన్నారు. ఎన్నుకున్న ప్రతి సభ్యుని పార్టీ సభ్యత్వ నమోదు నెంబరు మరియు పోన్ నంబర్ ను తప్పకుండా ఆన్ లైన్ లో అప్ లోడ్ చేయాలని మంత్రి నాయకులకు సూచించారు. ముఖ్యమంత్రి గారు పార్టీ అనుబంధ కమిటీల ఎంపికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారని నాయకులు ప్రత్యేక దృష్టి పెట్టి కమిటీల ఎంపిక పూర్తి చేయాలన్నారు.

త్వరలో పరిటాల శ్రీరామ్ వివాహం…. మంత్రి వెల్లడి

ఎంతో మంది పేదల పిల్లలను తన పిల్లలుగా భావించి దగ్గరుండి వివాహాలు జరిపించిన దివంగత శ్రీ పరిటాల రవీంద్ర గారి కుమారుడు పరిటాల శ్రీరామ్ వివాహ మహోత్సవం అక్టోబర్ 1 వ తేదీన వెంకటాపురంలో నిర్వహించనున్నట్లు మంత్రి పరిటాల సునీత వెల్లడించారు. ఆగష్టు 10 వ తేదీన పరిటాల శ్రీరామ్ నిశ్చితార్ధం జరుపనున్నట్లు మంత్రి తెలిపారు. పరిటాల కుటుంబ అభిమానులు తన కుమారుని వివాహ మహోత్సవం సందర్భంగా ఆశీస్సులు అందించాలని కోరారు.