తొలిసారిగా భార‌త ప్ర‌ధాని జోర్డాన్ ప‌ర్య‌ట‌న‌

modi, jordan king
modi, jordan king

న్యూఢిల్లీః భారత ప్రధాని నరేంద్రమోదీ పశ్చిమాసియా పర్యటన ప్రారంభమైంది. మూడుదేశాల్లో నాలుగు రోజులపాటు ఆయన పర్యటించనున్నారు. పశ్చిమాసియా, గల్ఫ్ దేశాలతో సంబంధాలను బలోపేతం చేయడమే ఎజెండాగా ప్రధాని పర్యటన సాగనున్నది. శుక్రవారం సాయంత్రం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరిన ప్రధాని మోదీ జోర్డాన్ రాజధాని అమ్మాన్‌కు చేరుకున్నారు. అమ్మాన్‌లో ఆయనకు ఘనస్వాగతం లభించింది. మోదీ తొలిసారిగా జోర్డాన్‌లో పర్యటిస్తున్నారు. గడిచిన మూడు దశాబ్దాల్లో ఆ దేశానికి వెళ్లిన తొలి భారత ప్రధాని కూడా ఆయనే. జోర్డాన్ ప్రధానమంత్రి హనీఅల్ ముల్కీ విమానాశ్రయంలో మోదీకి స్వాగతం పలికారు. అనంతరం రాజు అబ్దుల్లా-2తో మోదీ భేటీ అయ్యారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై వారిరువురూ చర్చించారు. రాజు అబ్దుల్లా-2తో సమావేశం అద్భుతంగా సాగింది. భారత్-జోర్డాన్‌ల మధ్య ఐదు దశాబ్దాలుగా ఉన్న స్నేహపూర్వక ద్వైపాక్షిక సంబంధాలు మరింత పటిష్టమయ్యేలా మా చర్చలు జరిగాయి అని ప్రధాని మోదీ ట్విట్టర్‌లో తెలిపారు. ఈ నెలాఖరులో జోర్డాన్ రాజు జరిపే భారత పర్యటన కోసం తామంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇరుదేశాల సంబంధాల్లో కొత్త అధ్యాయం ప్రారంభమైందని జోర్డాన్ రాజు వెల్లడించారు.