తెలుగు రాష్ట్రాల్లో కిడ్నీ రాకెట్‌ కలకలం

KIDNEY ROCKET
KIDNEY ROCKET

తెలుగు రాష్ట్రాల్లో కిడ్నీ రాకెట్‌ కలకలం

గోల్‌మాల్‌ వ్యవహారంలో బడా ఆసుపత్రుల హస్తం
అమాయకుల బీదరికాన్ని ఆసరాగా తీసుకుని రెచ్చిపోతున్న మెడికల్‌ మాఫియా

మురళీధర్‌ అమర్‌నాథ్‌ / హైదరాబాద్‌

తెలుగు రాష్ట్రాల్లో కిడ్నీ రాకెట్‌ వ్యవహారం పోలీసులకు సవాల్‌గా మారుతోంది. అమాయకుల పేదరికాన్ని ఆసరగా తీసుకుంటున్న కొందరు వైద్యులు మాఫియాగా మారి కిడ్నీలను కాజేస్తున్న వైనం ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపుతుండగా కిడ్నీలు పోగొట్టుకున్న వారి జీవితాలు చిధ్రంగా మారుతున్నాయి. ఏడు నెలల క్రితం హైదరాబాద్‌లోని కాంటినెంటల్‌ ఆసుపత్రిలో జరిగిన కిడ్నీ ఆపరేషన్లు నిబంధనలకు విరుద్దంగా జరిగాయని అందులోని వైద్యుడే పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచ లనంరేపగా తాజాగా గుంటూరులోని వేదాంత ఆసుపత్రిపైనా ఇటువంటి ఆరోపణలే రాసాగాయి. 2014లో హైదరాబాద్‌లో వెలుగు చూసిన కిడ్నీ రాకెట్‌కు గత ఏడా ది కంటినెంటల్‌ ఆసుపత్రిలో రట్టయిన అక్రమానికి సంబంధం వుందని పోలీసులు అనుమానిస్తూ ఆ దిశగా చేబట్టిన విచారణ ఇంకా ఓ కొలిక్కి రాకముందే గుంటూ రులో మరో కిడ్నీ రాకెట్‌ బండారం రట్టయ్యింది. ఈ రాకెట్‌ వ్యవహారంపై ఆ రాష్ట్ర విజిలెన్స్‌ విభాగం ప్రభుత్వానికి ఒక నివేదికను ఇచ్చింది. మరోవైపు నాలుగేళ్ల నాటి మూత్ర పిండాల రాకెట్‌ కేసులో నిందితులుగా వున్న శ్రీలంక వైద్యుల పాత్రపై పోలీసులు ఇంకా ఎటూ తేల్చక పోగా తాజా ఘటనల విచారణ ఎంత కాలం సాగేనోనని పలువురు అనుమానాలు వ్యక్తం చేయసాగారు. తెలుగు రాష్ట్రాలు అనేక రంగాల్లో వేగంగా అభివృద్ది చెందుతున్న విషయం ఎలా వున్నా అన్నిరకాల నేరాలు మాత్రం ఇక్కడే ఎక్కువగా జరుగుతుం డడం, చాలా వరకు నేరాల్లో మాఫియా రాజ్యం కొనసాగుతుండడం పోలీసులకు కొరకురాని కొయ్యగా మారుతోంది. ఇతర నేరాల విషయం ఎలావున్నా మెడికల్‌ మాఫియా అటు తెలంగాణ ఇటు ఎపిలో రెచ్చి పోతుండడం, ఇందుకు కొందరు వైద్యులు, వైద్య రంగ నిపుణులు తమవంతుగా సహకరిస్తుండడం చెప్పుకోదగ్గ అంశం.