తెలుగు రాష్ట్రాలను ముంచెత్తుతున్న వర్షాలు

Coal
Coal

సింగరేణిలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి
శ్రీకాకుళంలో 30 అడుగుల ముందుకు వచ్చిన సముద్రం
హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో చెరువులు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. మొన్నటి వరకూ నీరు లేక వెల వెల బోయిన చెరువులు వర్షపు నీటితో నిండుతున్నాయి. ఈ వర్షాలతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. వివిధ ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయం కావడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. రాష్ట్రంలోని ఉమ్మడి ఆదిబాద్‌ జిల్లా అతలాకుతలమవుతోంది. దీనికితగినట్లుగా మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో పెన్‌గంగా, ప్రాణహిత ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. మరోవైపు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. సిర్పూర్‌ వెంకట్రావుపేట్‌ వద్ద మహారాష్ట్ర-తెలంగాణ రాష్ట్రాలను కలుపుతూ ఉన్న వంతనపైకి భారీగా నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వెంకట్రావుపేట్‌ సమీపంలోని పలు గ్రామాలకు బ్యాక్‌ వాటర్‌ చేరడంతో గ్రామస్తులు భయాందోళనలకు గురవుతున్నారు. కాగా ఈ వర్షాలకు కడెం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 700 అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం 697.450 అడుగులకు చేరుకుంది. ప్రాజెక్టులోకి 10,700 క్యూసెక్కుల నీరు చేరుతుండడంతో ఒక గేటును ఎత్తి నీటిని దిగువనకు వదులుతున్నారు. భారీ వర్షాలతో మంచిర్యాల, నిర్మిల్‌, ఆదిలాబాద్‌లను కలిపే ప్రధాన రహదారిపై నూతనంగా ఏర్పడు చేస్తున్న అప్రోచ్‌ వంతెన తెగిపోయింది. దీంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. గోదావరి పరీవాహక ప్రాంతాల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఇరిగేషన్‌ అధికారులు సూచిస్తున్నారు. కాగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. సుమారు 45 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోవడంతో సంస్థకు భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. సింగరేణి ఓపెన్‌ కాస్ట్‌లోకి భారీగా వరద నీరు చేరడంతో ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతోపాటు ఇల్లందు, టేకులపల్లి మండలం కోయగూడెంలలో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం కలిగింది. ఇల్లందులో 8, కోయగూడెంలో 18 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అటకం కలిగింది. మరోపక్క ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి తదితర జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. జంగారెడ్డిగూడెం మండలం పట్టినపాలెం దగ్గర జల్లేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద ధాటికి రోడ్డు గండిపడింది. 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. శ్రీకాకుళం జిల్లాలో సముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది. అల్పపీడన నేపథ్యంలో జిల్లాలోని బారువా, రామయ్యపట్నం, ఇసుకలపాలెం తదితర ప్రాంతాల్లో సుమారు 30 అడుగుల మేర సముద్రం ముందుకు వచ్చింది.దీంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. కెరటాల తీవ్రత అధికంగా ఉండడంతో సముద్రం వైపునకు పోవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. సముద్ర తీరంలో సుమారు పది అడుగుల మేర ఇసుక తిన్నెలు కోతకు గురయ్యాయి.