తెలుగు మ‌హాస‌భ‌ల్లో ఎన్టీఆర్ ఊసు లేక‌పోవ‌డం బాధాక‌రంః మోత్కుప‌ల్లి

motkupalli narasimhulu
motkupalli narasimhulu

హైద‌రాబాద్ః ప్రపంచ తెలుగు మహాసభల్లో ఎన్టీఆర్‌ను విస్మరించడం బాధాకరమని మాజీ మంత్రి, టీ టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు పేర్కొన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ… చదువుచెప్పిన గురువుకు నమస్కరించిన కేసీఆర్… రాజకీయ గురువుకు దండం పెట్టవల్సిన బాధ్యత లేదా..? అని ప్రశ్నించారు. తెలుగు మహాసభల్లో ఎన్టీఆర్‌ను విస్మరించడంపై ప్రపంచంలోని తెలుగువారంతా బాధపడుతున్నారని, ముఖ్యమంత్రి పరిపక్వత లేకుండా వ్యవహరిస్తున్నాడని మోత్కుపల్లి పేర్కొన్నారు. కేసీఆర్‌తో సహా ఎంతోమందికి రాజకీయ జీవితాన్ని ఇచ్చిన నాయకుడు ఎన్టీఆర్ అని, తెలుగు జాతి ఔన్నత్యాన్ని పెంచిన మహనీయుడు ఎన్టీఆర్ అన్నారు. ఆయన్ను విస్మరించడం బాధాకరమన్నారు.
అలాగే… ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణను అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ఇంకా నాన్చడం సరికాదని, మాదిగ జాతిని చిన్నచూపు చూస్తున్నారని మోత్కుపల్లి అన్నారు. కేబినెట్‌లో కూడా ఒక్క మాదిగ కులస్తుడు లేడని, కేసీఆర్ వైఖరి మారకపోతే తగిన మూల్యం చెల్లిస్తాడన్నారు. మంద కృష్ణ పై పెట్టిన కేసులు వెంటనే ఉపసంహరించాలని ఆయన డిమాండ్ చేశారు.