తెలంగాణ-ఏపీ ఉద్యోగుల విభజనపై…

                 తెలంగాణ-ఏపీ ఉద్యోగుల విభజనపై…

EMPLOYEES
EMPLOYEES

షీలా బిడే కమిటీ నివేదిక ఎప్పుడో ?
అయోమయంలో తెలంగాణ ఉద్యోగులు
స్థానికతపై సీఎం హామీ అమలు చేయాలని విజ్ఞప్తి
హైదరాబాద్‌: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన జరిగి నాలుగేళ్లయినప్పటికీ తెలంగాణలోని ప్రభుత్వ శాఖలలో పని చేస్తున్న తమకు సరైన ప్రాధాన్యం లభించడం లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత వారం తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల జేఏసి ప్రభుత్వం ముందుంచిన 18 ప్రధాన డిమాండ్లలో ఔట్‌ సోర్సింగ్‌-కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలని ఉందనీ, దీనిపై సీఎం ఇచ్చిన హామీని పాటించక పోగా ఈ పద్దతిలో ఉన్న ఉద్యోగులను సైతం తొలగించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ప్రభుుత్వం లోని వివిధ శాఖలలో ఆంధ్ర ఉద్యోగులు ఉన్నత స్థాయిలలో ఉండటంతో అన్ని రంగాలలో వెనకబడి పోతున్నామని పేర్కొంటున్నారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తే ఔట్‌ సోర్సింగ్‌-కాంట్రాక్ట్‌ విధానం ఉండదని చెప్పి ఇప్పుడు అదే పద్దతిని అనుసరిస్తున్నారని పేర్కొంటున్నారు. కొన్ని విభాగాలలో ఉన్న కొద్ది పాటి ఉద్యోగులను సైతం అకారణంగా తొలగించి వారికి జీవనోపాధి లేకుండా చేస్తున్నారని అంటున్నారు. మరోవైపు, ఉద్యోగుల విభజనపై ఏర్పాటైన షీలా బిడే కమిటీ ఉద్యోగుల విభజనపై నివేదిక ఇంకా ఇవ్వకపోవడంతో ఖాళీలు ఎప్పుడు ఏర్పడతాయో, వాటిని తెలంగాణ ప్రాంత ఉద్యోగులతో ఎప్పుడు భర్తీ చేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. గృహ నిర్మాణ శాఖలో ఉమ్మడి రాష్ట్ర విభజన జరిగి తెలంగాణ హౌసింగ్‌ బోర్డు ప్రత్యేకంగా ఏర్పడే నాటికి దాదాపు 95 మంది ఉద్యోగులు ఉండగా, వారిలో 20 మంది ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఉద్యోగులతో పాటు మరో ఐదుగురు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు సైతం ఆ రాష్ట్రానికి చెందిన వారే కావడం గమనార్హం. వీరిని సొంత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కు పంపించక పోగా, తెలంగాణ ప్రాంతానికి చెందిన ఔట్‌ సోర్సింగ్‌ పద్దతిపై పని చేస్తున్న 28 మందిని అకారణంగా తొలగించినట్లు ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఉద్యోగులను ఎలాంటి కారణం లేకుండానే తొలగించగా, కనీసం తమను విధులలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేయడం కోసం కలవడానికి సైతం అంగీకరించడం లేదని పేర్కొంటున్నారు. హౌసింగ్‌ బోర్డులో ఉన్నత స్థాయిల్లో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగుల కారణంగానే ఇదంతా జరుగుతోందని ఆరోపిస్తున్నారు. హౌసింగ్‌ ఎండి, వీసీకి డిప్యూటీ ఈఈ పర్సనల్‌ సెక్రటరీ, సూపరింటెండెంట్‌ల కారణంగా తెలంగాణ ఉద్యోగులు ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొంటున్నారు. కాగా, తొలగించిన తెలంగాణ ప్రాంతానికి చెందిన 29 మంది ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులలో ఎక్కువగా కింది స్థాయి అధికార ులే ఉండటం గమనార్హం. వీరిలో అటెండర్‌, జూనియర్‌ అసిస్టెంట్‌, టైపిస్ట్‌, కంప్యూటర్‌ ఆపరేటర్‌ వంటి కింది స్థాయి ఉద్యోగులే ఉన్నారు. వీరిని 3-4-2018 నుంచి విధుల నుంచి తొలగించడంతో వీరి కుటుంబాలు వీధిన పడ్డాయి. అకారణంగా తొలగించిన తమను వెంటనే విధులలోకి తీసుకోవాలని 28 మంది ఉద్యోగులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే, తెలంగాణ స్థానికత ఉన్న ఆంధ్ర ప్రాంతంలో ఉన్న అధికారులను వెంటనే ఇక్కడి హౌసింగ్‌ బోర్డులో చేర్చుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా, తెలంగాణ-ఏపీ రాష్ట్రాల మధ్య ఉద్యోగుల పంపిణిపై ఏర్పాటైన షీలా బిడే కమిటీ నివేదిక ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందనీ, తెలంగాణ హౌసింగ్‌ బోర్డు ఎండి చిత్రా రామచంద్రన్‌ చెప్పారు. హౌసింగ్‌ బోర్డు నుంచి 28 మంది ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను తొలగించిన విషయం తన దృష్టికి రాలేదనీ పేర్కొన్నారు. షీలా బిడే కమిటీ నివేదిక ప్రకారం ఆంధ్ర ఉద్యోగులను వారి స్వరాష్ట్రానికి పంపడం జరుగుతుందని పేర్కొన్నారు.