తెలంగాణ ఎయిమ్స్‌కు కేంద్రం గ్రీన్ సిగ్న‌ల్‌

AIIMS , TELANAGANA
AIIMS , TELANAGANA

హైద‌రాబాద్ః రాష్ట్ర ప్రభుత్వం చేసిన సుదీర్ఘ ప్రయత్నాలు ఫలించాయి. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి, టీఆర్‌ఎస్ ఎంపీల కృషికి ఫలితం దక్కింది. రాష్ట్రంలో అఖిల భారత వైద్య విజ్ఞానశాస్ర్తాల సంస్థ (ఎయిమ్స్) ఏర్పాటుకు కేంద్ర ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు శుక్రవారం తెలంగాణ ప్రభుత్వానికి అందాయి. ఎయిమ్స్ ఏర్పాటుకు అవసరమైన రూ.3400 కోట్లు కేటాయించిన కేంద్ర ఆర్థికశాఖ.. భూసేకరణ ప్రక్రియ, మౌలిక సదుపాయాల కల్పనకోసం (సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ విభాగం, న్యాక్) సంస్థలను గుర్తించాలని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి ప్రీతిసుడాన్‌ను ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం లో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణకు ఎయిమ్స్ ఇస్తామని కేంద్ర ప్రభుత్వం రెండేండ్ల క్రితమే బడ్జెట్ సమావేశాల్లో ప్రకటించినా.. నిధుల కేటాయింపు, మౌలిక వసతుల కల్పన విషయాల్లో అనుమతులపై కేంద్ర ఆర్థికశాఖ జాప్యంచేసింది. దీంతో ఢిల్లీకి వెళ్లి, ప్రధాని నరేంద్రమోదీని కలిసిన సందర్భంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు.. ఎయిమ్స్‌కు అనుమతులు ఇవ్వాలని కోరారు.