తెలంగాణలో 119 స్థానాల్లో ఆమ్‌ ఆద్మీ పోటీ

SOMNATH BHARTI
SOMNATH BHARTI

దక్షిణ భారత్‌ ఇంచార్జి సోమనాథ్‌
హైదరాబాద్‌: కనివిని ఎరుగని రీతిలో ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠం అధిరోహించిన ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) నెమ్మదిగా అన్ని రాష్ట్రాల్లోనూ పాగా వేయాలని భావిస్తోంది. దక్షిణ భారత దేశంలో తమ పార్టీ ఉనికి చాటుకోవాలని ఆ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులోభాగంగానే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని ఆప్‌ నిర్ణయించింది. వీటికి సంబంధించి ఆమ్‌ ఆద్మీ పార్టీ దక్షిణ భారత్‌ ఇంచార్జి సోమనాథ్‌ భారతి వాటి విషయాలను శుక్రవారం ఢిల్లీలో మీడియాకు వివరించారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 119 స్థానాల్లో పోటీ చేస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే మాజీ ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, ఇతర పార్టీలకు చెందిన నేతలు ఆమ్‌ ఆద్మీ పార్టీ పార్టీ నుండి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని వెల్లడించారు. కాగా అమలు కాని అబద్దపు హామీలు ఇవ్వడంలో టిఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రధాని మోదీని మించిపోయారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్‌ సారధ్యంలోని మహా కూటమితో పొత్తు పెట్టుకునే అవకాశమే లేదన్నారు. ఒంటరిగానే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని తెలిపారు. సామాన్య ప్రజల కోసం ఆవిర్భవించిన ఆమ్‌ ఆద్మీ పార్టీకి అవకాశం ఇస్తే ఎలాంటి పాలన అందిస్తామో ఢిల్లీలో నిరూపించామని పేర్కొన్నారు. అవకాశమిస్తే తెలంగాణలోనూ అలాంటి పాలననే అందిస్తామని చెప్పారు. త్వరలోనే ఆప్‌ అభ్యర్థులు, మేనిఫెస్టోను ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు.