తెలంగాణలో సోనియా గాంధీ పర్యటన

sonia gandhi
sonia gandhi

నిజామాబాద్‌ లేదా కరీంనగర్‌లో బహిరంగ సభ
హైదరాబాద్‌: యుపిఐ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ తెలంగాణ పర్యటనకు టీ కాంగ్రెస్‌ నేతలు ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాలలోని కరీంనగర్‌ లేదా నిజామాబాద్‌ జిల్లాలో ఆమెతో బహిరంగ సభ నిర్వహించాలని పార్టీ నేతలు భావిస్తున్నారు. పర్యటన షెడ్యూల్‌ను గురు లేదా శుక్రవారాలలో ఖరారు చేయనున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్‌ పార్టీయేననీ, ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తే ఎన్నికలలో పార్టీకి ప్రయోజనం చేకూరుతుందన్నది నేతల ఆలోచన. ఇదిలా ఉండగా, గురువారం సీఎం కేసీఆర్‌ మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించి అసెంబ్లీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించనున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ ముఖ్య నేతలు అత్యవసర సమావేశం కావాలని నిర్ణయించారు. ఇందుకు గాను సీనియర్‌ నేతలు అందరూ గురువారం అందుబాటులో ఉండాలని గాంధీభవన్‌ నుంచి సమాచారం వెళ్లింది.
డీఎస్‌ కాంగ్రెస్‌లో చేరికకు అధిష్టానం గ్రీన్‌ సిగ్నల్‌
టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్‌ తిరిగి కాంగ్రెస్‌ గూటికి చేరేందుకు పార్టీ అధిష్టానం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. డీఎస్‌ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడనీ, ఆయనను టీఆర్‌ఎస్‌ నుంచి బహిష్కరించాలని నిజామాబాద్‌ జిల్లాకు చెందిన నేతలు ఎంపీ కవిత ఆధ్వర్యంలో తీర్మానం చేసి సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీలో ఇమడలేక పోతున్న డీఎస్‌ మళ్లీ సొంత గూటికి చేరేందుకు ప్రయత్నాలు ప్రారంభించనున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే ఆయన త్వరలోనే యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీతో పాటు పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీని కలవనున్నారనీ ప్రచారం జరుగుతోంది. ఈనెల 11 లేదా 12 సోనియా, రాహుల్‌ సమక్షంలో ఎమ్మెల్సీ భూపతిరెడ్డితో కలసి డీఎస్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా, తను పార్టీ మారబోతున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని డీఎస్‌ తెలిపారు. పార్టీ మార్పుపై వస్తున్న వార్తలన్నీ ఊహాగానాలేననీ, తనకు టీఆర్‌ఎస్‌ అధిష్టానం నుంచి సమాధానం కావాలనీ, మీడియాకు అన్ని విషయాలు స్పష్టం చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.