తెలంగాణలో మరో రెండు కొత్త రెవెన్యూ డివిజన్లు

Telangana
Telangana

కోరుట్ల, కొల్లాపూర్‌ ఏర్పాటుకు ప్రభుత్వ నిర్ణయం
హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు కానున్నాయి. ఈమేరకు రాష్ట్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు జగిత్యాల జిల్లాలోని కోరుట్ల, నాగర్‌కర్నూలు జిల్లాలోని కొల్లాపూర్‌ డివిజన్లు ఏర్పాటు చేయనున్నారు. మూడు మండలాలలో కోరుట్ల, నాలుగు మండలాలలో కొల్లాపూర్‌ రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు కానుండగా, ఇందుకు సంబంధించి ముసాయిదా నోటిఫికేషన్‌ గురువారం విడుదలైంది. కోరుట్ల, మేడిపల్లి, కథలాపూర్‌ మండలాలలో కోరుట్ల డివిజన్‌ను, కొల్లాపూర్‌, పెంట్లవెళ్లి, పెద్దకొత్తపల్లి, కోడేరు మండలాలలో కొల్లాపూర్‌ డివిజన్‌ను ప్రతిపాదించారు. అభ్యంతరాలు, సూచనలు లిఖితపూర్వకంగా 30 రోజుల్లో సంబంధిత కలెక్టర్‌కు ఇవ్వాలని ప్రభుత్వం తెలిపింది. ములుగు, నారాయణపేట జిల్లాలతో పాటు మరో నాలుగు మండలాల ఏర్పాటుకు గతంలోనే ముసాయిదా నోటిఫికేషన్‌ జారీ చేసి అభ్యంతరాలను కూడా స్వీకరించారు. కోయిల్‌కొండ, కోస్గి మండలాలను నారాయణపేటలో కలపడంపై స్థానికులు అభ్యంతర వ్యక్తం చేశారు. మహబూబ్‌నగర్‌లోనే కొనసాగించాలని ఆ రెండు మండలాల నుంచి భారీ విజ్ఞప్తులు వచ్చాయి. మహబూబాబాద్‌ జిల్లాలో ఉన్న కొత్తగూడ, గంగారం మండలాలను కూడా ములుగు జిల్లాల్లో కలపాలని భారీగా వినతులు అందాయి. ఈ నాలుగు మండలాలకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ప్రభుత్వ ఒక నిర్ణయానికి వచ్చాక కొత్త జిల్లాలు, మండలాల ఏర్పాటుకు సంబంధించి తుది నోటిఫికేషన్‌ జారీ చేయనున్నారు.