తెలంగాణలో పలు విద్యాశిక్షణ కేంద్రాల ఏర్పాటు

జాతీయ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ డెవలప్‌మెంట్‌ పథకం కింద
తెలంగాణలో పలు విద్యాశిక్షణ కేంద్రాల ఏర్పాటు
– పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్‌
హైదరాబాద్‌ : జాతీయ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ డెవలప్‌మెంట్‌ పథకం కింద తెలంగాణ రాష్ట్రంలో 30 హయ్యర్‌ లెర్నింగ్‌ సంస్థలు,అయిదు పాఠశాలలు,15 పారిశ్రామిక శిక్షణ సంస్థలు, రెండు ఎంటర్‌ప్రైనర్‌షిప్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్‌ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో కొత్తగా అమలు చేస్తున్న ఈ పథకంద్వారా ఎంటర్‌ప్రైననర్‌షిప్‌ అభివృద్ధికి దోహదపడుతుందని, విద్య, శిక్షణకు అధిక ప్రాధాన్యత ఏర్పడుతుందని తెలిపారు. దేశంలోని దాదాపు 7.10లక్షల మంది విద్యార్ధులకు ఈ విద్యను అందించే లక్ష్యంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారని వివరించారు. ఈ పథకానికి సంబంధించి విద్యార్ధులకు శిక్షణ ఇవ్వాలనుకునే సంస్థలు తమ దరఖా స్తులను ఈ నెల 26వ తేదీలోపు అందజేయాలని సూచించారు.ఈ పథకంలో భాగంగా ప్రతి సంస్థకు కనీసం 2500 చదరపు అడుగులకు పైగా స్థలాలు అవసరమని,ఇద్దరు ఫ్యాకల్టీస్‌ అవసరమని, ఇందుకు సంబంధించిన శిక్షణ సంస్థ 100 ఎంబిపిఎస్‌ బ్రాడ్‌బాండ్‌ కనెక్షన్‌ కలిగి ఉండాలని, కనీసం 250 విద్యార్ధులు ప్రతి ఏటా ఉంటూ నాలుగు సంవత్సరాలు కొనసాగాలని సూచించారు. ఎంపిక చేసిన శిక్షణ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం తగిన ఆర్థిక సహకారం అందిస్తుందని,9 లక్షల రూపాయల గ్రాంటుగా లభిస్తుందని, అంతేగాక అదనంగా 3లక్షల రూపాయలను ఉత్పాదక అవసరాలకు కేటాయిస్తారని వెల్లడించారు. ఫ్యాకల్టీలకు గౌరవ వేతనంగా ప్రతి నెల అయిదు వేల రూపాయలను అందిస్తారని అరవింద్‌కుమార్‌ తెలిపారు.